Amit Shah | తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. సిద్దిపేటలో గురువారం నిర్వహించిన బీజేపీ విశాల జనసభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో కమలాన్ని వికసింపజేయాలని కోరారు.
పదేండ్ల పాలనలో దేశంలోని ప్రధాన సమస్యలను బీజేపీ పరిష్కరించిందని అమిత్ షా తెలిపారు. దేశ ప్రజల చిరకాల స్వప్నం భవ్య రామమందిరం జరగకుండా కాంగ్రెస్ అనేక కుట్రలు చేసిందని ఆరోపించారు. రామ మందిరాన్ని నిర్మించి బాల రామున్ని ప్రతిష్టించామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ సమస్యను పరిష్కరించామని అన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నారని అన్నారు. మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మజ్లిస్ పార్టీకి తొత్తుగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వనున్నట్లు చెప్పారు.