న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా-ఏఐ సమ్మిట్ 2026 ప్రారంభించారు. కృత్రి మేధ(ఏఐ)పై వారం రోజులపాటు విస్తృత చర్చలు, ఒప్పందాలు, సాంకేతిక ప్రదర్శన మొదలైనవి ఈ సందర్భంగా చోటుచేసుకోనున్నాయి. ప్రధాని మోదీ అనేక అంకుర సంస్థలను సందర్శించి వాటి సాధనాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన ఎక్స్పో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు, పరిశోధనా సంస్థలు, కేంద్ర శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములుసహా 600 పైగా స్టార్టప్‌లను ఒక దగ్గరికి చేర్చింది. 300 పైగా స్టాళ్లు, లైవ్ డెమాన్స్ట్రేషన్స్ను ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌సహా 13 దేశాలు ఇందులో పాల్గొనడం ద్వారా ఏఐ రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యంపై వాటి ఆసక్తిని వెల్లడించాయి.
కృత్రిమమేధ (ఏఐ) సాంకేతికత వల్ల రాబోయే ఐదేండ్లలో ఐటీ, బీపీవో జాబ్స్ కనుమరుగవుతాయని టెక్ బిలియనీర్ వినోద్ ఖోస్లా హెచ్చరించారు. ఏఐ టెక్నాలజీ చాలా వేగంగా దూసుకొస్తున్నదని తెలిపారు. చాలా కొద్ది అంశాల్లో మాత్రమే మానవులు మెరుగైనవారిగా నిలబడతారని ఆయన అంచనావేస్తున్నారు. భారత ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026కు హాజరైన ఆయన, సోమవారం మీడియాతో మాట్లాడుతూ, నైపుణ్యం ఆధారిత పనుల్లో ఏఐ టెక్నాలజీ మానవులను అధిగమిస్తుందని అన్నారు. ప్రాథమికంగా సంప్రదాయ ఔట్సోర్సింగ్ నమూనాలను ఏఐ దెబ్బతీస్తుందని కూడా చెప్పారు. ఏఐ టెక్నాలజీ చాలా విషయాల్లో మానవులను అధిగమిస్తుందని, అకౌంటింగ్, వైద్యం, చిప్ డిజైన్, ఆర్కిటెక్చర్, అమ్మకాలు.. సహా అనేక విభాగాల్లో ఏఐ ఏజెంట్స్ వచ్చి చేరుతాయని అన్నారు.
కృత్రిమ మేధ(ఏఐ)నే మొత్తం వంద శాతం కోడింగ్ రాసేస్తుంటే.. తామేం చేయాలని చాలా మంది ఇంజినీర్లు ఇటీవల తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంథ్రోపిక్, క్లాడ్ కోడ్ లాంటి కంపెనీల్లో ఇది చురుగ్గా అమలవుతున్నదని ఆంథ్రోపిక్ కంపెనీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ మైక్ క్రైగర్ చెప్పడంపై వారు వాపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ల ప్రశ్నకు క్లాడ్ కోడ్ చీఫ్ డారియో అమోడి సమాధానమిచ్చారు. కోడింగ్ రాయడంలో ఏఐకు మార్గదర్శనం చేయాలని వారికి సూచించారు.
‘క్లాడ్ కోడ్ ఇప్పుడు వంద శాతం కోడ్‌ను రాస్తున్నది. అయితే ఆంథ్రోపిక్ వందకు పైగా ఓపెన్ డెవలపర్ ఉద్యోగాలను భర్తీ చేస్తుందా?’ అని ఒక ఎక్స్ యూజర్ అడిగిన ప్రశ్నకు క్లాడ్ కోడ్ అధిపతి బోరిస్ చెర్నీ స్పందిస్తూ కోడింగ్ ఉద్యోగాల్లో ఒక భాగం మాత్రమేనని చెప్పారు. ఏఐ సిస్టమ్స్‌ను ప్రమోట్ చేయడం ఇంజినీర్ల బాధ్యతేనన్నారు. ఇందుకోసం ఇతర టీమ్‌లతో వారు చర్చించి తర్వాత రూపొందించాల్సిన ప్రాజెక్ట్ గురించి చర్చించాలన్నారు. ఇదే విషయమై ఆంథ్రోపిక్ స్పందిస్తూ.. ఇంజినీర్లు సిస్టమ్ డిజైన్లలో, ఆర్కిటెక్చరల్ నిర్ణయాల్లో, దీర్ఘ కాలిక ప్రణాళికల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు.
కృత్రిమ మేధ సాంకేతికత భారతీయ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్నదని, ఏఐ టెక్నాలజీ ఉపాధి పెంచుతుందని భావిస్తే.. అది కలే అవుతుందని హెచ్‌సీఎల్ మాజీ సీఈవో వినీత్ నాయర్ అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో ప్రారంభమైన ‘ఇండియా ఏఐ సమ్మిట్-2026’లో డిబేట్ పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘భారతీయ ఐటీ కంపెనీలు సహా, ఇతర కంపెనీలు లాభాలపై ఆధారపడి పనిచేస్తాయి. కాబట్టి ఈ వాతావరణంలో ఉపాధిని ఎలా సృష్టిస్తామన్నది ప్రశ్న? భారీ స్థాయి స్టార్టప్‌లతో ఉపాధి ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎల్ఎల్ఎం (లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్) నమూనాలు భారతీయ నమూనాల కంటే చాలా ఉన్నతమైనవి. ప్రపంచస్థాయి ఉత్పత్తులు ఉన్నాయిగానీ, ఎల్ఎల్ఎంలు మన దగ్గర లేవు’ అని అన్నారు.