పాపన్నపేట, ఫిబ్రవరి 16: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల జనారణ్యంగా మారింది. జాతరలో ముఖ్య ఘట్టమైన బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగింది. నృత్యాలతో పోతరాజులు, శివసత్తులు కనువిందు చేశారు. ఉదయం నుంచి హైదరాబాద్, కర్ణాటక,మహారాష్ట్ర, ఏపీ తదితర ప్రాం తాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. పోతిశెట్టిపల్లి వై జంక్షన్గుండా చీమలదండు తలపించే విధంగా భక్తులు తరలివచ్చారు. నృత్యాలు,దుర్గనామస్మరణతో ఏడుపాయల జాతర హోరెత్తింది.అమ్మవారి మందు తిప్పే బండ్లను రవికలు,చీరలు,కొబ్బరి మట్టలు, దేవతామూర్తుల చిత్రపటాలు, మెరుపు కాగితాలతో అలంకరించారు.
మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఏడుపాయల జాతర రెండో రోజు సోమవారం ఉదయం ఐదు గంటల నుంచి ప్రత్యేక పూజలు చేసి దుర్గమ్మదర్శనాన్ని ప్రారంభించారు. తెల్లవారు జామునుంచే మంజీరా నదిలో స్నానాలు చేసిన భక్తులు దుర్గమ్మను దర్శిం చుకొని ఉపవాస దీక్షలు విరమించారు.గంటగంటకూ భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో క్యూ లైన్లు కిటకిటలాడాయి.
అనాధిగా వస్తు న్న ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానాదీశుల బండికి ఆలయ అధికారులు స్వాగతం పలకగా బండి ముందు డప్పుచప్పుళ్లకు అనుగుణంగా వందలాది మంది యువకులు చిందులు వేశారు.మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్,అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రమాదేవి అనుక్షణం పర్యవేక్షించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావు ఎప్పటికప్పుడు జాతరను పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్,మెదక్ డీఎస్పీ జాతర భద్రతపై సమీక్షించారు. ఏడుపాయల జాతరకు చివరి ఘట్టమైన మంగళవారం రాత్రి రథోత్సవం జరగనుంది.