Medak DEO | పాపన్నపేట, జూలై 28: మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) రాజు మంగళవారం పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులు, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు డీఈవో సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం మండల పరిధిలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించి, శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా పాపన్నపేటకు వచ్చిన డీఈవో రాజును పీఆర్టీయూ నాయకులు ఘనంగా సన్మానించారు.