న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వ్యాపారులకు ఉచిత చెల్లింపు విధానంగా గత ఆరేండ్లుగా కొనసాగుతున్న యూపీఐ అక్టోబర్ 15 నుంచి పరీక్షను ఎదుర్కోనున్నది. వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే రూ.2,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపై 0.4% మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) అమల్లోకి రానున్నది. వ్యాపారులు ఈ భారాన్ని వినియోగదారులపై మోపితే ఈ మార్పు వల్ల అధిక సంఖ్యలో వినియోగదారులు నగదు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, బ్యాంకు బదిలీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని లోకల్ సర్కిల్స్ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది.
సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో కేవలం 14శాతం మంది మాత్రమే రూ.2,000 కంటే అధిక మొత్తానికి చేసే చెల్లింపులపై వ్యాపారి అదనపు రుసుము వసూలు చేస్తే ఆ ఆదనపు ఖర్చును భరిస్తూనే యూపీఐ ద్వారా చెల్లింపులు కొనసాగిస్తామని చెప్పారు. మిగిలిన వారు వేరే చెల్లింపు విధానాన్ని ఎంచుకుంటామని లేదా కొనుగోలును విరమించుకుంటామని లేదా వాయిదా వేస్తామని తెలిపారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో 291 జిల్లాలకు చెందిన యూపీఐ వినియోగదారుల నుంచి 67,000కు పైగా స్పందనలు వచ్చాయి.
ఒకవేళ వ్యాపారి అదనపు రుసుము వసూలు చేస్తే వినియోగదారులు ఏమి చేస్తారన్న నిర్దిష్ట ప్రశ్నకు సంబంధించి 11,206 స్పందనలు నమోదయ్యాయి. వీరిలో అత్యధికులు(27 శాతం) తాము నగదు రూపంలో చెల్లిస్తామని చెప్పారు. మరో 26 శాతం మంది క్రెడిట్ కార్డుకు మారుతామని చెప్పగా, 4 శాతం మంది డెబిట్ కార్డును ఉపయోగిస్తామని తెలిపారు. మరో 4 శాతం మంది బ్యాంక్ బదిలీలు, నెఫ్ట్ లేదా ఐఎంపీఎస్ పద్ధతులను ఉపయోగిస్తామని, 9 శాతం మంది అదనపు రుసుము లేని మరో చెల్లింపు విధానం గురించి వ్యాపారిని అడుగుతామని చెప్పారు.
కేవలం 14 శాతం మాత్రమే యూపీఐని ఉపయోగించడాన్ని కొనసాగిస్తూ ఆ మొత్తాన్ని భరిస్తామని చెప్పారు. మరో 2 శాతం మంది కొనుగోలును వాయిదా వేస్తామని లేదా మానుకుంటామని చెప్పగా 4 శాతం మంది దీనిపై ఏమీ చెప్పలేకపోయారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు ఏడుగురిలో ఒకరు మాత్రమే ఆ అదనపు ఖర్చును తామే భరించి యూపీఐని కొనసాగిస్తామని చెప్పారు.
వ్యాపారుల ఆందోళన
ఈ కొత్త ఖర్చును భరించడానికి వెనుకాడుతున్నది వినియోగదారులు మాత్రమే కాదు. 242 జిల్లాల్లోని 32,000కు పైగా వ్యాపార సంస్థలపై లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక ప్రత్యేక సర్వేలో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ భరించడానికి కేవలం 17 శాతం మంది వ్యాపారులు మాత్రమే సుముఖత వ్యక్తం చేశారు. 41 శాతం మంది తాము ఎటువంటి ఎండీఆర్ భరించబోమని చెప్పగా మరో 9 శాతం మంది తాము యూపీఐని అస్సలు అంగీకరించడం లేదని తెలిపారు.