న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్( Kangana Ranaut) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జెన్ జెడ్ నిరసనకారుల్ని.. జనరేషన్ గట్టర్గా ఆమె పేర్కొన్నారు. ఆ నిరసనకారులు ఓ మురికి కాలువ లాంటివారన్నారు. ఆందోళనకారులను బొద్దింకలతోనూ పోల్చారామె. చాలా తీవ్రమైన స్థాయిలో జెన్ జీ నిరసనకారులపై కంగనా రనౌత్ కామెంట్ చేశారు. ఆందోళనలకు చెందిన రీల్స్, పోస్టులను నిరసనకారులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే అవన్నీ వాంతలు తెప్పించేలా ఉన్నాయని రనౌత్ పేర్కొన్నారు. నిరసన ప్రదర్శన వేళ వాళ్లు వాడిన భాషను ఆమె తప్పుపట్టారు.
ఎంపీ కంగనా రనౌత్ ఇన్స్టా స్టోరీలో తన అభిప్రాయాలను పోస్టు చేశారు. తన జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడూ చూడలేదన్నారు. జెన్ జెడ్ నిరసనకారులు పోస్టు చేస్తున్న రీల్స్ వాంతులు తెప్పిస్తున్నాయని, వాళ్లు వాడుతున్న భాష కూడా తనెప్పుడూ చూడలేదన్నారు. వీళ్లను ఎవరు కంటున్నారు, ఎవరు పెంచుతున్నారని ఆమె పెదవి విరిచారు. భారత్ విభిన్న సంస్కృతుల సుందర ప్రదేశమని, సున్నితత్వం.. సంస్కృతి మేళవించి ఉంటాయన్నారు. మీకు మీరే కాక్రోచ్ అని పిలుచుకుంటారని, వాటిలాగా ప్రవర్తిస్తున్నారని ఆమె అన్నారు. దీనికి ఏవీ పోలికలు అవసరం లేదని, బొద్దింకలు జీవించేది చాలా గలీజు, చెత్త, జిగుప్పాకరమైన ప్రపంచం అది అన్నారు. జెన్ జెడ్లు పోస్టు చేసిన వీడియోలు చూస్తే భయం వేస్తోందని, డిజిటల్ డీటాక్స్ అవసరమని ఎంపీ కంగనా రనౌత్ తన పోస్టులో వెల్లడించారు.
మరో పోస్టులో పాశ్చాత్యీకరణ చెందిన భారతీయ మహిళల గురించి కామెంట్ చేశారు. స్వేచ్ఛ పేరుతో వాళ్లు డ్రగ్స్, డ్రింక్స్ తీసుకుంటారని, తల్లితండ్రుల సంపాదనపై బతికేస్తుంటారన్నారు. వాళ్లను జనరేషన్ గట్టర్ అని పిలువాలని, వాళ్ల నుంచి సమాజానికి ఏమీ లాభం లేదని, వాళ్లు చదువుల్లోనూ వ్యర్థమని, వాళ్లు ఎంత చెడ్డవారేంటే, వాళ్లు చాలా అవినీతికి పాల్పడుతారని, కనీసం ఇంటిపని కూడా చేయరు అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేతలు విమర్శలు చేశారు. కంగనా భాషను కాంగ్రెస్, ఎంఐఎం తప్పుపట్టాయి. క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి.
