Smart Phones | ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకు మనం నిత్యం ఫోన్ లను ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదయం లేచిన తరువాత నేల మీద కాలు పెట్టక ముందు నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం ఫోన్ లను చూస్తూనే ఉంటాం. ఈ విధంగా నిత్యం ఫోన్ ను ఉపయోగించడం వల్ల నిద్రకు అంతరాయం కలగడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడడాన్ని మానేయాలని వారు హెచ్చరిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు ఫోన్ ను చూడడం వల్ల నిద్రకు ఆటంకం కలగడంతో పాటు అనేక సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలియజేస్తున్నారు. నిద్రించే ముందు ఫోన్ ను చూడడం వల్ల మనకు ఏవిధమైన నష్టం కలుగుతుందో.. వైద్యుల మాటల్లో తెలుసుకుందాం.
ఫోన్ నీలికాంతిని విడుదల చేస్తుంది. ఇది మెదడుకు నిద్రించే సమయం ఆసన్నమైందని తెలియజేసే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. దీని వల్ల నిద్ర ఆలస్యం అవుతుంది. శరీరానికి విశ్రాంతి తగ్గుతుంది. నిద్రించే ముందు ఫోన్ చూడడం వల్ల నిద్ర నాణ్యత తగ్గడంతో నాటు నిద్రించే సమయం కూడా తగ్గుతుంది. ఫోన్ ను ఎక్కువగా చూసే వారు రాత్రి 8 గంటల పాటు కూడా నిద్రించడం లేదని వారిలో దీర్ఘకాలిక నిద్రలోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. నిద్రించే ముందు ఫోన్ ను వాడడం వల్ల నిద్రలేమి వచ్చే అవకాశాలు 60 శాతం వరకు పెరుగుతాయని వైద్యులు పరిశోధనల ద్వారా వెల్లడించారు.
కొందరు రాత్రి సమయంలో కూడా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. ఇలా రాత్రి సమయంలో ఎక్కువగా ఫోన్ మాట్లాడే వారు తక్కువ సమయం నిద్రించడంతో పాటు తరచూగా మేల్కొంటారు. ఇలా తరచుగా మేల్కోవడం వల్ల గాఢ నిద్ర వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు తగ్గుతాయి. రాత్రిపూట ఫోన్ వాడకం నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. తగినంత సమయం నిద్రించకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి మానసికపరమైన సమస్యలు తలెత్తుతాయి. రాత్రిపూట సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల దానిలో వచ్చే కొన్ని రకాల కంటెంట్స్ మనకు భయాన్ని, ఆందోళనను కలిగించే అవకాశం ఉంది. దీంతో మనసు ప్రశాంతత కోల్పోవడంతో పాటు నిద్రకు కూడా ఆటంకం కలుగుతుంది. స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా వాడడం వల్ల చాలా మంది నిద్ర మధ్యలో మేల్కొంటున్నారు. ఇలా మేల్కోవడం వల్ల గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. ఇలా జరగడం వల్ల శరీరానికి లోతైన విశ్రాంతి లభించడానికి బదులుగా భౌతికంగా పాక్షిక హెచ్చరిక స్థితిలో ఉంటుంది.
ఫోన్ వాడకం ఎక్కువగా ఉండడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. నిద్రలేమి కారణంగా శరీర జీవక్రియలు మందగించడంతో పాటు శక్తి వినియోగించే హార్మోన్లు కూడా ప్రభావితం అవుతాయి. దీంతో శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా నిద్రలేమి కారణంగా ఏకాగ్రత, అభిజ్ఞా పనితీరు దెబ్బతినడం వంటివి కూడా జరుగుతాయి. కనుక నిద్రించే ముందు ఫోన్ ను వాడకపోవడమే మంచిది. ఇది ఒక క్రమశిక్షణ లాటింది మాత్రమే కాదని దీని వల్ల నిద్ర చక్రం మెరుగుపడడంతో పాటు మన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.