మామిళ్లగూడెం/ ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 16: జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. అలాగే, ఆయా వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా వారికి వసతులు మెరుగుపరచాలని సూచించారు. ‘ప్రజా వైద్యం, యాసంగి ధాన్యం సేకరణ, రోడ్డు భద్రత, పెండింగ్ పనులు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు’ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు.
ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాల్లో పంచాయతీల భవనాలు, అంగన్వాడీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఎద్దడి రాకుండా కార్యాచరణ చేపట్టాలన్నారు. యాసంగి దిగుబడి అంచనాలకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. జడ్పీ సీఈవో దీక్షారైనా, వివిధ శాఖల అధికారులు యాకూబ్, డాక్టర్ రామారావు, డాక్టర్ రాజశేఖర్, చందూనాయక్, శ్రీలత, రాంబాబు, పుష్పలత, వాణిశ్రీ పాల్గొన్నారు.
దివ్యాంగ విద్యార్థులు రాణించాలి: కలెక్టర్
దివ్యాంగ విద్యార్థులు పట్టుదలతో ముందడుగు వేసి అన్ని క్రీడాంశాల్లోనూ రాణించాలని కలెక్టర్ అనుదీప్ ఆకాంక్షించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో వివిధ క్రీడా విభాగాలకు ఎంపికైన దివ్యాంగ చిన్నారులు హైదరాబాద్‌లో మంగళవారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్లే బస్సును కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ బాజోజు ప్రవీణ్‌కుమార్, జడ్పీ సీఈవో దీక్షారైనా, ఇన్చార్జి డీఈవో చావా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’ వినతులను పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.