మంగళవారం 09 మార్చి 2021
Business - Jan 31, 2021 , 00:56:33

ద్రవ్యలోటును దాచొద్దు

ద్రవ్యలోటును దాచొద్దు

  • పన్నులను తగ్గించాలి  
  • డిమాండ్‌కు ఊతమివ్వాలి
  • ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి  
  • విస్తరణాత్మక బడ్జెట్‌ కావాలి
  • కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక నిపుణుల సూచన

ఈసారి కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన గతంలో కంటే భిన్నంగా జరగబోతున్నది. కరోనా సంక్షోభమే ఇందుకు ప్రధాన కారణం. ద్రవ్యలోటును లెక్కించడంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించేందుకు ఈ మహమ్మారి అవకాశాన్ని కల్పించింది. సాధారణంగా బడ్జెట్‌ రూపకల్పన సమయంలో ద్రవ్య లక్ష్యాలకు కట్టుబడి ఉండాలని ఎక్కువ మంది ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి సూచిస్తుంటారు. కానీ ఈసారి వ్యయాన్ని పెంచడం, పన్నులను తగ్గించడం లాంటి చర్యలతో విస్తరణాత్మక దృక్పథంతో కూడిన బడ్జెట్‌ను రూపొందించాలని అన్ని రంగాల ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యలోటు పెరగడాన్ని వైఫల్యంగా పరిగణించరాదని, వాస్తవిక ద్రవ్యలోటును దాచిపెట్టాల్సిన అవసరం లేదని ఉద్ఘాటిస్తున్నారు. వాస్తవానికి గత కొన్నేండ్ల నుంచి కేంద్ర ద్రవ్యలోటు అంచనాల కంటే 1.5 నుంచి 2 శాతం అధికంగానే నమోదవుతున్నది. ప్రభుత్వ వ్యయం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తున్న అప్పులే ఇందుకు ప్రధాన కారణమని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా కాటుతో దారుణంగా కుదేలైన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారీగా పెరుగుతుందన్న అంచనాలున్నప్పటికీ.. ఈ వృద్ధి ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థను కొవిడ్‌-19కు ముందున్న స్థాయిల వరకే చేర్చగలుగుతుంది. వ్యాపారాలు, ఎగుమతులు, ఉత్పత్తులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నందున పన్ను రాబడుల్లో వృద్ధి మందకొడిగా ఉండవచ్చు. 

వృద్ధికి ఊతమివ్వాలి

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్‌ను తీసుకురావడం ఎంతైనా అవసరం. అంటే గతంలో మాదిరిగా ప్రజల నుంచి మరిన్ని పన్నులు వసూలు చేయడంపై దృష్టి సారించడానికి బదులుగా దేశ ఆర్థిక వృద్ధిని ఏవిధంగా గాడిలో పెట్టాలన్న దానిపై దృష్టి కేంద్రీకరించాలి. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రులు ప్రభుత్వ వాస్తవిక ద్రవ్యలోటు పరిమాణాన్ని దాచిపెట్టేవారు. దీనిలో కొంత భాగాన్ని బ్యాలెన్స్‌ షీట్‌ నుంచి తొలగించేవారు. ప్రభుత్వ రంగ సంస్థలు, చమురు కంపెనీలు, ఇతర వ్యవస్థల ద్వారా ప్రభుత్వం సేకరించే రుణాలను బడ్జెట్‌లో రహస్యంగా దాచేవారు. కానీ ఈసారి అలాంటి పనులు చేయవద్దని, వాస్తవిక ద్రవ్యలోటును దాచిపెట్టాల్సిన అవసరమే లేదని ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో సవరించిన ద్రవ్యలోటు జీడీపీలో 6 నుంచి 7 వరకు ఉంటుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించే ద్రవ్యలోటు 5-6 శాతం వరకు ఉండవచ్చని తెలుస్తున్నది.

డిమాండ్‌ పెంచాలి

దేశ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు విస్తరణాత్మక దృక్పథంతో కూడిన బడ్జెట్‌ను రూపొందించాలంటున్న ఆర్థికవేత్తలు.. డిమాండ్‌ను పెంచేందుకు రెండు ప్రధాన మార్గాలను సూచిస్తున్నారు. వ్యయాన్ని పెంచడం, పన్నుల్లో కోత విధించడం ద్వారా డిమాండ్‌ను పెంచవచ్చని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సమాజంలోని వివిధ వర్గాల సంక్షేమం కోసం చేసే వ్యయంతోపాటు కొవిడ్‌-19తో తీవ్రంగా నష్టపోయిన రంగాలపై ప్రభుత్వం వ్యయాన్ని పెంచాలంటున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీలతో ప్రజలకు డబ్బు అందజేయాలని దీంతో డిమాండ్‌ త్వరగా పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. డిమాండ్‌కు ఊతమిచ్చేందుకు పన్నులను హేతుబద్ధీకరించడం మరో మార్గం. ఉదాహరణకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటు తగ్గిస్తే.. తద్వారా ఆదా అయ్యే సొమ్మును ప్రజలు ఇతర వస్తువుల కొనుగోలుకు వెచ్చిస్తారు. దీంతో డిమాండ్‌ పెరుగుతుంది. వస్తు, సేవల పన్ను రేట్లపై నిర్ణయాధికారం జీఎస్టీ కౌన్సిల్‌ పరిధిలో ఉంటుంది గనుక బడ్జెట్‌లో జీఎస్టీ రేట్లను తగ్గించకపోవచ్చు. కానీ బడ్జెట్‌లో ప్రభుత్వం ఆదాయ పన్ను రేట్లను తగ్గించేందుకు, కార్పొరేట్‌ పన్నులను, పన్ను వసూళ్ల వ్యవస్థను సరళతరం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పని చేయగలిగితే మదుపరుల్లో విశ్వాసం పెరుగుతుంది. ఇది అంతిమంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తుంది.

వ్యవసాయం కీలకం


దేశ జనాభాలో సగభాగం పైగా ఆధారపడి ఉన్న వ్యవసాయ, అనుబంధ రంగాలపై కేంద్ర బడ్జెట్‌ ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొవిడ్‌ లోనూ ఇది ఎక్కువమందికి ఉపాధి కల్పించే రంగంగా మారింది. ఆర్థిక సంక్షోభ సమయంలో అనుకూల వృద్ధి రేటు సాధించింది. బడ్జెట్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా కేటాయింపులను పెంచాలి. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సహాయపడే ప్రయత్నాలతోపాటు, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాలకు నిధులు ఎక్కువ చేయాలి. వ్యవసాయం, అనుబంధ రంగాల పునరుజ్జీవనం, జాతీయ ఆహార భద్రతా మిషన్‌, ప్రధానమంత్రి కృషి సిన్చాయి యోజన కోసం కేటాయింపులు, వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన పథకాలు, వ్యవసాయ- పర్యావరణ ఆధారిత బడ్జెట్‌కు ప్రాధాన్యమివ్వాల్సి ఉన్నది. వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి రైతుల ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడానికి దోహదపడాలి. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద రైతుకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రెట్టింపు చేయాలి. పరోక్ష సబ్సిడీ రూపంలో కాకుండా రైతులకు నగదు రూపంలో సాయం అందించాలి.

కౌలు రైతుల కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉంది. తద్వారా కొవిడ్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన అనేక మందికి వెంటనే ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుంది. కొవిడ్‌ అనంతర కాలంలో సురక్షిత పోషక ఆహార పదార్థాల డిమాండ్‌ పెరుగుతుందని అంచనా. పర్యావరణ అనుకూల ఉత్పత్తి విధానాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలి. వ్యవసాయ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులకు పన్ను రాయితీల అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అగ్రి- టెక్‌ స్టార్టప్‌లు, ఇన్నోవేషన్లు మరింత అవసరం. అర్థవంతమైన పాత్ర పోషిస్తున్న వర్ధమాన వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి ఎక్కువ సంఖ్యలో ఇంక్యుబేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. 


VIDEOS

logo