తాండూర్, జూన్ 23 : నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల(Drugs)కు దూరంగా ఉండాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. చదువుపై శ్రద్ధ పెట్టి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని సీఐ పిలుపునిచ్చారు. ‘యాంటీ-డ్రగ్ అవేర్నెస్’ వారోత్సవాల్లో భాగంగా సోమవారం తాండూర్ సర్కిల్ కార్యాలయంతో పాటు మాదారం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో తంగళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచేత మొక్కలు నాటించారు సీఐ.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలను వివరించారు. ‘విద్యార్థి దశ మీ జీవితానికి అత్యంత కీలకమైన పునాది. ఈ సమయంలో ఆకర్షణలకులోనై గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారమమవుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని, మీ కలలను కూడా నాశనం చేస్తుంది. ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ చాలా కఠినమైనది, ఒకసారి ఈ కేసులో చిక్కుకుంటే జీవితాంతం దాని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి, మీరంతా చైతన్యవంతులై, మీ స్నేహితులను కూడా ఈ వ్యసనం వైపు వెళ్లకుండా కాపాడాలి” అని ఆయన విద్యార్థులకు హితవు పలికారు. అంతేకాదు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా.. గంజాయి దుష్ప్రభావాలను కళ్ళకు కట్టినట్లు చూపే దృశ్యరూపక వీడియోలను ప్రదర్శించి, వారికి అవగాహన కల్పించారు సీఐ.
అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టేషన్ ఆవరణలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు సీఐ. పర్యావరణాన్ని కాపాడడంతో పాటు, విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సర్కిల్ పరిధిని గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని, ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని సీఐ తెలిపారు. ప్రజల్లో చైతన్యం, వారి సహకారంతోనే గంజాయిని పూర్తిగా నిర్మూలించగలమని, తద్వారా నేరరహిత సమాజాన్ని స్థాపించగలమని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాదారం ఎస్సై సౌజన్య, శిక్షణ ఎస్ఐ అనూష, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.