అచ్చంపేట రూరల్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ (Rajeev Yuva Vikas) పథకాన్ని అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) అచ్చంపేట డివిజన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డిఓ ఆఫీస్కు వెళ్లి ఏవో అమృద్దీన్ (Amruddin)కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వర్ధ సైదులు (Vardha Saidulu)మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దరఖాస్తుల తప్ప అమలు నోచుకోవడం లేదని విమర్శించారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు అందించడానికి రాష్ట్ర యువ వికాస్ పథకం ద్వారా అర్హులకు రూ.50 వేల నుండి రూ.5 లక్షల వరకు ఇస్తామని చెప్పిన సర్కార్ రూ. 6000 కోట్లు కేటాయించిందన్నారు సైదులు. ఈ పథకానికి 16 లక్షల 25 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవంనాడు యువ వికాస్ పథకం లబ్ధిదారులకు నిధులను మంజూరు చేస్తామని ప్రచారం చేశారని.. కానీ నిధుల విడుదలను వాయిదా వేశారని ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారులందరికీ నిధులు మంజూరు చేయాలని సైదులు డిమాండ్ చేశారు. సిబిల్ స్కోర్ లేకున్నా నిరుద్యోగ యువతీ యువకులకు ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతతో కలిసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని సైదులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు మహేష్, డివిజన్ కమిటీ సభ్యులు ఏలేందర్, డివిజన్ నాయకులు మహేష్ కుమార్, రాజు రవి తదితరులు పాల్గొన్నారు.