సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): భారత జాతీయ చిహ్నం మూడు సింహాలు, అశోక చక్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అత్యున్నత స్థానాల్లో పనిచేస్తున్న కొద్ది మంది వాహనాలకు మాత్రమే ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ చిహ్నాన్ని ఇష్టానుసారంగా ఎవరు పడితే వారు తమ వాహనాలకు వాడటం చట్టరీత్యా నేరం. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో జాతీయ చిహ్నాన్ని అధికారికంగా వినియోగించడం పూర్తిగా నిషిద్ధం. కానీ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో జేసీఈఎస్ హోదాలో ఉన్న ఓ ఉన్నతాధికారి మాత్రం తనకు ప్రభుత్వం కేటాయించిన వాహనం ముందు నంబర్ ప్లేట్ పైభాగాన మూడు సింహాలు, అశోక చక్రం ఉన్న జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అదే వాహనాన్ని అధికారిక కార్యక్రమాలకు వెళ్లేందుకు, కార్యాలయ రాకపోకలు కూడా సాగిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఉన్నత స్థాయి అధికారులు వినియోగించే జాతీయ చిహ్నాన్ని వాహనానికి ఏర్పాటు చేసుకుని ప్రయాణిస్తున్నారు. ఆయన జేసీఈఎస్గా కూడా అదనపు బాధ్యతల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఛైర్మన్, మెంబర్ సెక్రెటరీ కంటే తక్కువ క్యాడర్ అధికారి అలా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఇదంతా మెంబర్ సెక్రటరీకి తెలిసే జరుగుతుందా? లేదంటే జాతీయ చిహ్నం ఉన్న వాహనం ఎవరు వినియోగించాలో ఆ అధికారికి తెలియదా? దానిపై అవగాహన లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చిహ్నాన్ని పెట్టడం ప్రొటోకాల్‌కు విరుద్ధం
జాతీయ చిహ్నం ఉన్న వాహనాలు రోడ్లపైకి వచ్చినప్పుడు పోలీసులు సైతం ప్రొటోకాల్ పాటిస్తారు. ఆ వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు. ఆ వాహనాలకు ప్రత్యేక దారిని కల్పిస్తారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా నియంత్రిస్తారు. రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర రాష్ట్ర కేబినెట్ హోదా కలిగిన అధికారులు, నేతల వాహనాలపై జాతీయ చిహ్నం ఉంటుంది. అదేవిధంగా రక్షణ రంగంలో పనిచేసే ఉన్నతాధికారుల వాహనాలకు కూడా మూడు సింహాలు, అశోకచక్రం ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు కూడా జాతీయ చిహ్నం ఉన్న వాహనాన్ని వినియోగిస్తున్నారు. కానీ కాలుష్య నియంత్రణ మండలి జేసీఈఎస్ కూడా అదేవిధంగా రోడ్లపై ప్రయాణిస్తూ పోలీసులు, సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
జేసీఈఎస్ కంటే ఉన్నతాధికారులైన పీసీబీ చైర్మన్‌గా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పీసీబీ మెంబర్ సెక్రటరీ వాహనాలకు కూడా అలా జాతీయ చి హ్నం లేకపోవడం విస్తుగొలిపిస్తున్నది. పీసీబీలో మెంబర్ సెక్రెటరీకి రెండు అధికారిక వాహనాలున్నా దేనికీ జాతీయ చిహ్నం లేదు. కానీ మెంబర్ సెక్రెటరీ కంటే కిందిస్థాయి అధికారి దర్జాగా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జేసీఈఎస్గా కూడా ఆయన అదనపు బాధ్యతల్లోనే ఉన్నారు. వరంగల్ జోనల్ ఆఫీస్ నుంచి పదోన్నతిలో జేసీఈఎస్గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. జేసీఈఎస్గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టకున్నా జాతీయ చిహ్నం వాడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.