బూర్గంపహాడ్, జూన్ 23 : పోడు చేసుకుని జీవనం సాగించే గిరిజన ఆడబిడ్డలపై ఫారెస్ట్ అధికారులు విచక్షణా రహితంగా దాడి చేయడం అమానుషమని, అలాంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు కిషన్ నాయక్ అన్నారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి బీట్‌లోని కోసగుంపులో గత మూడు రోజుల క్రితం ఫారెస్ట్ అధికారుల దాడిలో గాయపడిన పోడు గిరిజనులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలపై అటవీ అధికారుల దాడిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖండించారని, ఆమె ఆదేశాల మేరకు తాను ఈ గిరిజన కోసగుంపును సందర్శించి పరామర్శించడం జరిగిందన్నారు. ఇంత విచక్షణా రహితంగా మహిళలను వివస్త్రను చేసి దాడిచేయడం సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. దాడిచేసిన వారిలో డీఆర్ఓ నాగరాజు అనే వ్యక్తి గతంలో ఇదే రేంజ్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడని, అలాంటి అధికారికి మళ్లీ ఇదే రేంజ్లో పోస్టింగ్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
అంతేకాకుండా దాడికి రెండు రోజుల ముందే పోడు గిరిజనుల దగ్గరకు వచ్చి ఇంటికి రూ.2 వేల చొప్పున 30 కుటుంబాల నుంచి రూ.60 వేలు తీసుకుని అక్కడే పార్టీ చేసుకుని వెళ్లారని గిరిజనులు చెప్పారని, ఇంత అమానుషం ఎక్కడైనా ఉంటుందా అని మండిపడ్డారు. ఇక్కడి గిరిజనులు 25 ఏళ్ల క్రితం నుంచే భూములు సాగు చేసుకుంటుంటే ఇప్పుడు అటవీ అధికారులు పోడు భూముల్లోకి వెళ్లి యంత్రాలతో అడ్డుకోవడం ఏమిటని, మహిళలు అని కూడా చూడకుండా దాడులకు పాల్పడడం సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు. గిరిజన ఆడబిడ్డలకు న్యాయం జరిగేంత వరకు జాగృతి అండగా ఉంటుందన్నారు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన అటవీ అధికారులను సస్పెండ్ చేసి గిరిజనులకు న్యాయం చేయాలని, ఈ విషయంలో అటవీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సేవాలాల్ సేన రాష్ట్ర కో-కన్వీనర్ బాణావత్ హుస్సేన్‌నాయక్, గిరిజన సంఘ నాయకులు ఉన్నారు.