దుండిగల్, జూన్ 23: రూ.లక్షల విలువైన గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని ఓ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరించారు. ఏపీలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా హర్యానాకు ఈ నెల 22న గంజాయిని తరలిస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు, దుండిగల్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్-5 (దుండిగల్ గేట్) వద్ద తనిఖీలు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో టాటా నెక్సాస్ కారు (ఏపీ 40 డీఎం8365) అనుమానాస్పదంగా కనిపించడంతో కారును ఆపి తనిఖీలు చేరపట్టారు.
ఇందులో 43 ప్యాకెట్లలో 120.17 కిలోల గంజాయి దొరికింది. ఈ గంజా విలువ మార్కెట్లో రూ.45లక్షల వరకు విలువ ఉంటుందని చెప్పారు. దీంతో కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. కర్నాటక గుల్బర్గా జిల్లా సేవాలాల్ మందిర ప్రాంతానికి చెందిన సాగర్ పవార్ (23)గా గుర్తించినట్లు చెప్పారు. తరచూ సెల్ నంబర్లు మారుస్తూ.. గంజాయిని ఒక వాహనం నుంచి మరో వాహనానికి మారుస్తూ గంజాయిని సరిహద్దులు దాటిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 120.17 కిలోల గంజాయితో పాటు కారు, ఐదు సెల్ఫోన్లు సీజ్ చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులు దేవరాజ్, భజరంగ్, హనుమంతు పవార్, రాజకుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించి పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులను డీసీపీ అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఈటీ డీసీపీ, ఏసీపీ, మేడ్చల్ ఏసీపీలతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.