మూసీ నది.. అనంతగిరి కొండల్లో పుట్టి చారిత్రక హైదరాబాద్ నగరం మీదుగా వందల కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. ప్రవాహ ప్రస్థానంలో అనేక మలుపులు తిరుగుతున్నా ఈ జీవనదికి దశాదిశ అంటూ ఉంది. కానీ మూసీని ఉద్ధరిస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికకు మాత్రం ఓ దశా దిశ లేకుండా తయారైంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తొలుత మూసీలోకి మురుగు చేరకుండా చర్యలు తీసుకుంటూనే మరోవైపు నిరుపేదల ఇటుక కూల్చకుండా సుందరీకరణ పనులను కూడా చేపట్టారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అంచనాతో మూసీ రాగం అందుకొని తాజాగా రూ.5వేల కోట్ల గాంధీ సరోవర్ ప్రాజెక్టు పల్లవిని పాడుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ప్రకటనలు మొదలు ప్రాజెక్టు
ప్రణాళికలోనే అనేక వంకర టింకరలు. సాక్షాత్తూ మంత్రులు మొదలు ముఖ్యమంత్రిదాకా లక్షన్నర కోట్లతో మూసీని కడిగిన ముత్యంలా చేస్తామని ప్రకటనలు చేశారు. ఆపై ప్రాజెక్టు నివేదిక పూర్తి కాకముందే అంచనాల్ని ఎలా చెబుతారంటూ జనం మీదికే ఎదురుదాడి చేస్తున్నారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ)
మూసీ పునరుజ్జీవం విషయంలో కాంగ్రెస్ సర్కారుకు స్పష్టత ఉంటే… ప్రాజెక్టును ఎక్కడ నుంచి మొదలు పెట్టాలన్నది తేల్చాలి. ఇప్పటికీ 55 కిలోమీటర్ల వెంబడి ప్రవహించే నదిని అభివృద్ధిని దశల వారీగా చేపట్టే పనులకు.. ఏడాది కిందటే చాదర్‌ఘాట్ వద్ద ఎందుకు కూల్చివేతలు చేపట్టారనేది అంతు చిక్కని ప్రశ్న. అంతేకాదు గాంధీ సరోవర్, లేదా ఏడాది కిందట చేపట్టిన కూల్చివేతలు, తాజాగా హిమయత్ సాగర్ ఒడ్డున్న 500 మీటర్ల దూరంలో ఉండే నివాస సముదాయాలను కలిపి హద్దులు నిర్ధారించడం కూడా గందరగోళంగానే చేపట్టింది. ఇక మూసీ నది వెంబడి 55 కిలోమీటర్ల పొడువునా ఇరువైపులా కిలోమీటర్ వెడల్పుతో అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. అంతలోనే బఫర్ జోన్ పరిధిని 50 మీటర్ల లోపే ఉంటుందని ప్రకటన చేసింది. కానీ కిలోమీటర్ దూరంలో ఉండే గృహ సముదాయాల ప్రాంతంలో ఎందుకు మార్కింగ్ చేశారని చెప్పలేకపోతుంది. డీపీఆర్ లేకుండా ఏకంగా 176 పేదల ఇండ్లను కూల్చిన రేవంత్‌రెడ్డి, గాంధీ సరోవర్ పేరిట మధు రిడ్జ్ పార్క్‌తోపాటు, మరో 1500 నిర్మాణాలను కూడా నేలమట్టం చేసేలా దాదాపు 225 ఎకరాల విస్తీర్ణంలో భూసేకరణకు సన్నద్ధమవుతున్నది. ఇలా స్పష్టమైన హద్దులు లేకుండానే మూసీ పరీవాహక జనాలను భయాందోళనకు గురిచేస్తున్న సర్కారు… పేదల ఇండ్ల మీదికి కాంగ్రెస్ బుల్డోజర్లను తరలించేందుకు సిద్ధం అవుతోంది. మూసీ వెంబడి ఉండే పేదలకు నష్టం చేయమంటూనే, బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలున్నా తొలగిస్తామని, హద్దులు తేల్చకుండానే కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మూసీని ఉద్దరిస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికకు దశా దిశా లేకుండా తయారైంది. ప్రభుత్వ పెద్దల ప్రకటనలు మొదలు ప్రాజెక్టు ప్రణాళికలోనే అనేక వంకర టింకరలు ఉన్నాయి. లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అంచనాతో మూసీరాగం అందుకొని తాజాగా రూ.5వేల కోట్ల గాంధీ సరోవర్ ప్రాజెక్టు పల్లవిని పాడుతున్నది. కాంగ్రెస్ సర్కారుకు మూసీ పునరుజ్జీవం విషయంలో స్పష్టత లేదు. ఎలాంటి డీపీఆర్ లేకుండా ఏకంగా 176 పేదల ఇండ్లను కూల్చిన రేవంత్ రెడ్డి, గాంధీ సరోవర్ పేరిట మధు రిడ్జ్ పార్క్‌తోపాటు, మరో 1500 నిర్మాణాలను కూడా నేలమట్టం చేసేలా దాదాపు 225 ఎకరాల విస్తీర్ణంలో భూసేకరణకు సన్నద్ధమవుతున్నది. ఇదిలాఉంటే రూ.176 కోట్లతో అద్భుతమైన అయిదు నివేదికలతో మూసీ తీరాన్ని సియోల్ చేస్తామంటూ ముఖ్యమంత్రి సచివాలయం వేదికగా సింగపూర్ కన్సార్టియం ఎంపికను ప్రకటించారు. పనిలో పనిగా ఈ సర్కారు బుల్డోజర్ రాజ్ పేరును సార్ధకం చేసుకునేందుకు చాదర్‌ఘాట్ పరిధిలో 176 నిరుపేదల ఇండ్లను కూల్చివేసి అభం శుభం తెలియని అమాయక బడుగు జీవుల కుటుంబాలను బజారున పడేశారు. తీరా… ఇప్పుడు అవన్నీ తర్వాత ముందు ఈసా-మూసీ కలిసేచోట అద్భుతమైన గాంధీ సరోవన్ను చేపడతామంటూ సరికొత్త రాగాన్ని అందుకుంది. రూ.5వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా ఉంటున్న వారిని ఖాళీ చేయండి అంటూ హుకూం జారీ చేస్తున్నది. జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు యుద్ధప్రాతిపదికన మార్కింగ్ చేస్తూ పరీవాహక ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లను పరిగెత్తిసున్నది. గాంధీ విగ్రహం కోసం సామాన్యుడి గూడును ఎందుకు కూల్చివేస్తారంటూ సాక్షాత్తూ గాంధీ మనవడు తుషార్‌గాంధీ లాంటి వాళ్లు కన్నెర్రజేస్తుంటే… కూల్చివేతల్ని కప్పిపుచ్చుకునేందుకు నేడు సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక (డీపీపీ)తో ఇంకోసారి మూసీని మసిబూసి మారేడుకాయ చేసేందుకు సిద్ధమైంది.
మూసీ అభివృద్ధిపై సర్కారు చేసే ప్రకటనలు… క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు ఎక్కడా పొంతన లేకుండా పోతుంది. ముందుగా లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ నది, పరివాహాక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సబర్మతి ప్రాజెక్టుకు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. అవసరమైతే అందుకు అనుగుణంగా 2024లోనే మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను వందల కోట్ల రూపాయలతో సింగపూర్‌కు చెందిన మెయిన్హర్ట్ కంపెనీకి కట్టబెట్టింది. అయితే ఇందులోనే 5 రకాల మాస్టర్ ప్లాన్లు ఉంటాయని ప్రకటన చేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సార్టియంకు ఈ బాధ్యతలు అప్పగించామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే స్పష్టం చేశారు. కానీ ఎలాంటి మాస్టర్ ప్లాన్ గానీ, డీపీఆర్ గానీ లేకుండానే ఏడాదిన్నర తర్వాత గాంధీ సరోవర్ పేరిట భారీ విగ్రహాం కడుతామంటూ కొత్త రాగాన్ని అందుకుని మూసీ నదికి దశా-దిశా లేకుండా చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. గతంలోనే మూసీ నదిపై 15 బ్రిడ్జిల నిర్మాణానికి కసరత్తు చేసింది. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిలకు ప్రత్యామ్నాయంగా డెవలప్ చేయాలని ప్రణాళికలు రూపొందించింది. కానీ సర్కారు ఆ విషయాన్ని మరిచింది. రెండున్నరేళ్ల తర్వాత నగరంలో మూసీ మీద కాంగ్రెస్ సర్కారు 29 బ్రిడ్జిలను నిర్మించాలని హెచ్ఎండీఏతో కలిసి ప్రణాళికలను తెరమీదకు తీసుకువస్తోంది. అసలు ప్రణాళికల్లో ఉన్న బ్రిడ్జిల పురోగతి తేల్చకుండా, కొత్త ప్రతిపాదనలతో మూసీ అభివృద్ధిపై గాలి మాటలతో ప్రకటనలు చేస్తోంది.
అయితే సర్కారు చేపట్టే మాటలు, చేస్తున్న పనులకు సంబంధం లేకపోవడంతో.. మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్నవన్నీ కూడా కుట్రలేనని మేధావులు మండిపడుతున్నారు. పర్యావరణ విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని చెబుతున్నా సర్కారు… నిషేధిత బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేయకుండా ఎలా అభివృద్ధి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ-ఈసా సంగమ ప్రాంతంలో నిర్మించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు కూడా అలాంటిదేనని, గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పేదలను ఇండ్లను కూల్చి విగ్రహాలు ఎలా కడతారంటూ గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగానే సూచించారు. ఇక జీవనది మూసీ పరిరక్షణలో రాజీ లేని పోరాటం చేస్తున్న పర్యావరణవేత్త మేథా పాట్కర్‌తోపాటు, సుబ్బారావు లాంటి పర్యావరణ నిపుణులూ కూడా కాంగ్రెస్ కుట్రలకు మూసీ నది బలి కాబోతుందని స్పష్టం చేశారు. ఎలాంటి డీపీఆర్ లేని ప్రాజెక్టు పేరిట పేదల హింసిస్తే సహించేది లేదని చెబుతున్నారు. సోషల్ ఇంపాక్ట్ అసెసెమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వరకు అన్ని బహిర్గతం చేయాలని, ప్రాజెక్టుకు అవసరమైన డీపీఆర్ ముందుగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్ధూ భాషల్లో విడుదల చేయాలన్నారు. భూసేకరణ నోటిఫికేషన్ కూడా ప్రజాస్వామ్య విరుద్ధమేనని వ్యాఖ్యానించిన మేథా పాట్కర్… రెండు నెలల పాటు ప్రజల సూచనలు, అభ్యంతరాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రభావిత ప్రజలు, మూసీ జన ఆందోళన్ ప్రతినిధులు, ప్రజా సంఘాలు, జేఏసీలు లేకుండా కేవలం కార్పొరేట్ శక్తులను మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేస్తుండటంపై తీవ్రంగా తప్పు బట్టారు.
మూసీ ప్రక్షాళన పేరిట దశాబ్ధాలుగా పరీవాహక ప్రాంతంలో నివాసం ఉంటున్నవారికి ఎలాంటి నష్టం చేయమంటూనే… వారిని తరలించేందుకు ఇచ్చే పరిహారం విషయంలో సన్నాయి నొక్కులతో సాగుతోంది. హద్దులే నిర్ధారించకుండా, ప్రభావిత నిర్మాణాలపై స్పష్టమైన ప్రకటన చేయకుండానే బఫర్ జోన్, ఎఫ్టీఎల్, రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు టీడీఆర్ రూపంలోనే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఏకంగా జీవోనే జారీ చేసింది. అసలు ఆ విషయాన్నే మరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… పరిహారంగా కోల్పోయిన భూమికి సమానంగా భూమినిస్తామంటూ వ్యాఖ్యానించడంలో సర్కారు చెప్పే మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేకుండా పోతుంది. తొలి దశలో చేపట్టే గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు టీడీఆర్ పరిహారం కాకుండా సర్కారు ఏవిధంగా భూములిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
మరో రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో మూసీ నది అష్టవంకరలు తిరిగే పరిస్థితి వచ్చింది. అధికారంలోకి రావడంతోనే రూ. 16వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో దిశానిర్దేశం లేకుండా చేశారు. జంట జలాశయాల నుంచి 55 కిలోమీటర్లు ప్రవహించే మూసీ నదిని సియోల్‌లోని జీవనదిలా, మరోసారి లండన్ థేమ్స్‌లా మారుస్తామంటున్న సర్కారు అసలు మూసీ నదిని ఏం చేయబోతున్నారని ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నది. ఇందుకు మూసీ నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రకటనలే అద్దం పడుతున్నాయి. డీపీఆర్ లేకుండానే దాదాపు 220 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే గాంధీ సరోవర్ ప్రాజెక్టు సజీవ సాక్ష్యంలా మారనున్నది.
మూసీ అభివృద్ధిపై అసెంబ్లీ సాక్షిగా మాటలు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ డీపీఆర్ రూపకల్పన పూర్తి చేశామని చెప్పుకోలేకపోతుంది. కానీ తొలి దశలో చేపట్టే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ ప్లానింగ్‌తో వివరిస్తామంటూ బుకాయించే ప్రయత్నం చేస్తోంది. అసలు డీపీఆర్‌లో లేని నిర్మాణాలను ఎలా కడుతారని ప్రశ్నిస్తున్న ప్రజాసంఘాలు, నిర్మాణ రంగ నిపుణులకు కూడా సర్కారు సమాధానం చెప్పలేకపోతుంది. కానీ ప్రాజెక్టు పేరిట ఒకేసారి రూ. 5900 కోట్లను ఖర్చు చేసేందుకు అడ్డు పడుతున్న 450 కుటుంబాలను బలిపీఠం ఎక్కాల్సిందేనని తేల్చి చెబుతోంది.