ఆమెకు రెండు కాళ్లూ లేవు. అయినా ఆమె ప్రయాణానికి పరిమితుల్లేవు! ఆ రెండు కాళ్లూ ఓ ప్రమాదంలో కోల్పోయింది. కృత్రిమ కాళ్ల సహాయంతో నడిచే ఆమె కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగిగా, యోగా శిక్షకురాలిగా రాణిస్తున్నది. వైకల్యం అసమర్థత కాదని, మనోబలం ఉంటే శారీరక సామర్థ్యం ఉన్నట్టేనని చెబుతున్న అర్పితా రాయ్ స్ఫూర్తిమంతమైన ప్రయాణం ఇది.
అర్పితా రాయ్ పశ్చిమ్ బెంగాల్లో పుట్టి పెరిగింది. పదేళ్ల క్రితం… స్కూటర్‌పై ప్రయాణిస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో అర్పిత రెండు కాళ్లు పోగొట్టుకుంది. కొన్నాళ్లు మంచానికే పరిమితమైంది. కాళ్లు పోగొట్టుకున్న వాళ్లు కోలుకున్నా మానసికంగా కుంగిపోతారు. మామూలు మనిషి కావడానికి చాలా కాలం పడుతుంది. కానీ, అర్పిత కాళ్లు మాత్రమే కోల్పోయింది, మనోబలాన్ని కాదు. తనకే ఎందుకిలా జరిగిందని బాధపడుతూ అక్కడే కూర్చుండిపోలేదు. బలాన్ని కూడదీసుకుని కదిలే ప్రయత్నం చేసింది. కృత్రిమ కాళ్ల సహాయంతో నడవడం కోసం డాక్టర్లను కలిసింది. కొన్నాళ్లకే కృత్రిమ కాళ్లతో నడిచే సామర్థ్యాన్ని సంతరించుకుంది. ఇక ఆమె ప్రయాణం మరెక్కడా ఆగలేదు.
‘వైకల్యం అసమర్థత కాదు. మనోబలం ఉంటే శరీరం దాని మాట వింటుంది’ అని అర్పిత నమ్మకం. ఆరోగ్యం కోసం హఠ యోగా నేర్చుకోవాలనుకుంది. ‘యోగాసనాలు వేయడం కాళ్లు లేనివాళ్లకు సాధ్యమేనా?’ అని చాలామంది సందేహించేవారట. కొంతమంది ఆమె సాధనను చూసి వంకలు పెట్టేవాళ్లట. హేళనగా మాట్లాడటం సమాజంలో చూస్తున్నదే. ఆ మాటలు విని బాధపడకుండా, వాటికి విలువ ఇవ్వకుండా పట్టుదలతో ముందడుగు వేసింది. శరీరాన్ని రబ్బరులా వంచి యోగాసనాలు, కష్టసాధ్యమైన ఆసనాలూ ఇష్టంగా సాధన చేసింది. ఇప్పుడు అర్పిత అన్ని ఆసనాలనూ అలవోకగా వేయగలదు. శీర్షాసనంలో తలకిందులుగా శరీరాన్ని బ్యాలెన్స్ చేయగలదు. సంవత్సరాల తరబడి యోగా సాధన చేసేవాళ్లు కూడా సాధించని నైపుణ్యాన్ని ఆమె చేజిక్కించుకుంది. ‘ఈ ప్రయాణంలో సాధించిన విజయాలకు సంతోషిస్తాను. కాళ్లు కోల్పోయానని బాధ లేదు. కాకపోతే కొందరి నిర్లక్ష్య వైఖరి మాత్రమే బాధ కలిగిస్తుంది’ అని అర్పిత చెబుతుంది. ఆమె చెప్పినట్టే శరీరాన్ని మనోబలంతో నడిపిస్తున్నది. జీవితంలో ఏదైనా సాధించడానికి శారీరక సామర్థ్యం కంటే మనోబలమే ప్రధానమని చెబుతుంది అర్పిత జీవితం.

‘ఆటంకాలు మన కలల కంటే బలమైనవి కావు. కాబట్టి ఏ అవరోధమూ మనల్ని ఆపలేదు’ అని అర్పిత తనను కలిసిన ఆడపిల్లలకు చెబుతుంటుంది. తన తల్లితో కలిసి ఆరేళ్ల క్రితం కోల్‌కతా నుంచి హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. కొంతకాలం క్రితం తల్లిని కోల్పోయింది. ఉద్యోగం చేస్తూనే యోగాతో కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. నగరంలోని ఓ ఫిట్నెస్ అకాడమీలో యోగా శిక్షకురాలిగా పనిచేస్తున్నది. యోగానే తన భవిష్యత్తుగా మార్చుకునే కొత్త ప్రయాణంలో ఉన్నానని అర్పిత చెబుతున్నది. కెరీర్లోనూ రాణిస్తూ, ఈ స్ఫూర్తిని ఆమె ఇలాగే కొనసాగించాలని మనమూ కోరుకుందాం.
‘ఎలా జరిగింది’ అని అడిగితే.. ‘గతాన్ని గుర్తు చేయకండి. భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటున్నావని అడగండి’ అంటుంది అర్పితా రాయ్. ‘ధైర్యంగా ముందుకు సాగడమే జీవితం. గతంలోని బాధలను గుర్తు చేసుకుని కాలాన్ని వృథా చేసుకోను’ అని బదులిస్తుంది.‘గతాన్ని గుర్తు చేసుకుంటూ
ఉంటే కాళ్లు పోగొట్టుకున్న చోటే ఆగిపోయేదాన్ని. ఇంత దూరం ప్రయాణం చేసేదాన్నే కాదు. ఇక ముందు కూడా ప్రయాణం చేయాలి. కాబట్టి ఏం చేయబోతున్నావనే అడగండి’ అన్న అర్పిత మాటలు ఆమె పట్టుదలకు నిదర్శనాలు.