తిమ్మాపూర్/శంకరపట్నం, మార్చి12 : తిమ్మాపూర్ మండలం నేదునూర్ శివారులో జరిగిన దారి దోపిడీ కలకలం రేపింది. గ్రామాల్లో వైద్యం చేసి ఇంటికెళ్తున్న ఆర్ఎంపీ కండ్లలో కారం చల్లి, తులం గోల్డ్ చైన్, నగదు లాకెళ్లడం సంచలనం సృష్టించింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, కారంపొడి ప్యాకెట్ కొన్న క్లూతో తీగలాగి ఐదుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. అందులో ఇద్దరిని జీపీఎస్ ఆధారంగా సినీఫక్కీలో కార్ చేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎల్ఎండీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం గుండ్లపల్లె గ్రామానికి చెందిన తమ్మనవేణి కొమురయ్య ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి తిమ్మాపూర్ మండలం నేదునూర్‌లో తన పనులు ముగించుకొని, బైక్‌పై ఇంటికి బయలుదేరాడు.
మార్గమధ్యలో ఓ వ్యక్తి లిఫ్ట్ అడుగడంతో అతడిని ఎకించుకునేందుకు బైక్ ఆపాడు. వెంటనే ఆ వ్యక్తి కంట్లో కారం చల్లగా.. మరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. వారిద్దరూ కలిసి కొమురయ్య మెడలో ఉన్న తులం బంగారు గొలుసు, జేబులోని వెయ్యి రూపాయలు లాకొని, తలపై గట్టిగా కొట్టి పరారయ్యారు. బాధితుడు కొమురయ్య తేరుకొని, బైక్‌పై గ్రామానికి చేరుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. తర్వాత రాత్రి 11గంటల ప్రాంతంలో ఎల్ఎండీ పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు, అప్పటికే అందిన సమాచారంతో రంగంలోకి దిగారు. తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ ఆధ్వర్యంలో ఎల్ఎండీ ఎస్ఐ అన్వర్ టీం విసృ్తతంగా తనిఖీలు చేశారు. రాత్రి 9గంటల ప్రాంతంలో గుండ్లపల్లి వద్ద విచారణ జరుగుతుండగా.. ఓ యువకుడు దుకాణం వద్ద కారం పొడి ప్యాకెట్ కొనుగోలు చేసినట్టు తెలియడంతో ఆ యువకుడిని పట్టుకొని విచారించారు. దీంతో పోలీసులే నివ్వెరపోయేలా ప్లాన్ ఉండడంతో తీగ లాగారు.
తెలిసిన సమాచారం ప్రకారం.. గుండ్లపల్లికి చెందిన ఇద్దరు, నుస్తులాపూర్‌కు చెందిన ఒకరు, తిమ్మాపూర్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న మరో ఇద్దరు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు దారిదోపిడీని ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఆర్ఎంపీ కొమురయ్య ప్రతిరోజూ గ్రామాల్లో తిరుగుతూ.. వైద్యం చేసి రాత్రి నిర్మానుష్య ప్రాంతాల నుంచి రావడం గమనించారు. రెండు మూడు రోజులుగా రెక్కీ నిర్వహించారు. బుధవారం రాత్రి ప్లాన్ అమలు చేసేందుకు స్కెచ్ గీశారు. ఐదుగురు టీంలో ఇద్దరు కరీంనగర్లో ఓ వ్యక్తి వద్ద కారు కిరాయికి తీసుకొని, మరో ముగ్గురికి అప్పగించారు. అందులో ఒకరు నేదునూరు నుంచి కొమురయ్య బయలుదేరిన సమాచారం అందించగా, మరో ఇద్దరు కారును కొద్ది దూరంలో పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. కొమురయ్య నిర్మానుష్య ప్రాంతానికి రాగానే.. ఒక యువకుడు లిఫ్ట్ అడిగాడు. బైక్ ఆపగానే వెనుక నుంచి మరో యువకుడు వచ్చి కొమురయ్య కండ్లలో కారం కొట్టి గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇద్దరు కలిసి బంగారు గొలుసు, నగదు తీసుకొని పరారయ్యారు.
కారం పొడి ప్యాకెట్ కొన్న యువకుడిని విచారించగా.. మరో ఇద్దరు యువకులను రప్పించి పట్టుకున్నారు. మరో ఇద్దరి కోసం కారు అద్దెకు ఇచ్చిన వ్యక్తి వద్ద విచారించగా, కారుకు జీపీఎస్ ఉన్నట్టు ఎల్ఎండీ పోలీసులు తెలుసుకున్నారు. గురువారం ఉదయం జీపీఎస్ ట్రాక్ చేస్తుండగా.. అల్గునూర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్నట్టు గుర్తించారు. అల్గునూర్ నుంచి వెంబడిస్తుండగా.. గుర్తించిన దొంగలు అతివేగంగా కేశవపట్నం వరకు వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా కారును అడ్డగించి, వారిని పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఒకరిని పట్టుకున్నా.. మరో దొంగ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో చేజ్ చేశారు. స్థానికులను అలర్ట్ చేస్తూ.. దొంగ వెంట పరుగెత్తారు. చివరకు పట్టుకున్నారు. తర్వాత ఆ ఇద్దరిని స్టేషన్‌కు తరలించారు. సినీ ఫక్కీలో చేజ్ చేస్తూ పట్టుకోవడం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో కొంతసేపటి వరకు అర్థం కాక ఉత్కంఠగా తిలకించారు.