ఆరోగ్యశ్రీని నాటి వైఎస్ సర్కార్ ప్రారంభిస్తే, మంచి పథకమని ప్రశంసించిన కేసీఆర్.. దాన్ని కొనసాగిం చారు. మరింత పకడ్బందీగా పథకాన్ని అమలు చేశారు. కానీ అదే ఆరోగ్యశ్రీ గొంతు నులుముతున్నది ఇప్పటి కాంగ్రెస్ సర్కార్. సేవలను కుదించింది. బకాయిల చెల్లింపులు బంద్ చేసింది. పనిగట్టుకొని ప్రభుత్వ దవాఖానలను నిర్వీర్యం చేస్తున్నది.
కరీంనగర్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ విద్యానగర్: సర్కార్ దవాఖానల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాంరాం చెబుతున్నది. రెండున్నరేండ్లుగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ప్రభుత్వ దవాఖానలను నిర్వీర్యం చేస్తున్నది. ఫలితంగా నిరుపేదలకు లభించే అనేక ఆరోగ్య సేవలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. బకాయిలు, బిల్లుల చెల్లింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం
నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో అత్యవసర సమయాల్లో పరికరాలను సరఫరా చేసే ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు రాకపోవడంతో.. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, సిబ్బందికి పారితోషికాలు నిలిచిపోయాయి. దీంతో వైద్యులతోపాటు సిబ్బందిలోనూ నిరుత్సాహం ఏర్పడుతున్నది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులను ప్రైవేట్‌కు రిఫర్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ దవాఖానలోనూ ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బకాయిలు, బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ దవాఖానలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సర్కార్.. ప్రైవేట్‌కు పెద్దపీట వేస్తూ.. ప్రభుత్వ దవాఖానలపై వివక్ష చూపుతున్నది. ఇదే విధానం కొనసాగితే, ప్రభుత్వ దవాఖానలు ఆరోగ్యశ్రీ సేవలకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉన్నది.
బకాయిల విడుదల్లో నిర్లక్ష్యం
నిరుపేదలకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం బాగున్నదన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ కూడా ఆ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కానీ, రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై పూర్తిగా నీలినీడలు కమ్ముకునేలా చేసింది. హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన నుంచి మొదలుకొని జిల్లా దవాఖానల వరకు..ఆరోగ్యశ్రీ కింద రావాల్సిన కోట్లాది రూపాయిల బకాయిల కోసం ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రంలోని పెద్ద దవాఖానలైన గాంధీ, టీచింగ్ హాస్పిటల్స్, ఎంఎన్జేపాటు జిల్లా కేంద్రాల్లోని దవాఖానలకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.750 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని తెలుస్తున్నది. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానకు రాజీవ్ ఆరోగ్య కింద రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్లకుపైగా బకాయిలు రావాల్సి ఉన్నది. ఈ దవాఖానలో రోజుకు సుమారు రెండు వేల మంది రోగులు ఔట్ పేషెంట్ సేవలు పొందుతుంటారు. ఇన్‌పేషెంట్లు 450 మంది వరకు ఉంటారు. ఇదే తరహాలో, రాష్ట్రంలోని జిల్లాల్లో ఒక్కో ప్రభుత్వ దవాఖానకు ఆరోగ్య శ్రీ కింద సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు బకాయిలున్నాయి. పెద్ద దవాఖానలైన గాంధీకి రూ.70 కోట్లు, ఉస్మానియాకు రూ.80 కోట్లు, వరంగల్ ఎంజీఎంకు రూ.30 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇన్సెంటివ్‌లు దూరం.. సేవలు మృగ్యం
ప్రైవేట్ దవాఖానలకు భిన్నంగా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ దవాఖానలకు చెల్లింపులు జరుగుతాయి. ఆరోగ్యశ్రీ కింద వచ్చే నిధుల్లో 60% దవాఖాన అకౌంట్‌కు చేరుతాయి. మిగిలిన 40% ఆరోగ్యశ్రీ కింద సేవలందించిన లేదా చికిత్స చేసిన వైద్యులు, వైద్య సిబ్బందికి పారితోషికం కింద చెల్లిస్తారు. ప్రభుత్వ దవాఖానల్లో అనుకున్న స్థాయిలో వేతనాలు లేకపోవడంతో వైద్యులు, వైద్య సిబ్బంది ఎక్కువ కాలం పనిచేయడం లేదని భావించిన గత ప్రభుత్వాలు.. ఆరోగ్యశ్రీ కింద పారితోషికం వర్తింపజేస్తూ వచ్చాయి. దీంతో వైద్యులు, వైద్యసిబ్బంది ప్రభుత్వ దవాఖానల్లో అనేక రకాల సేవలు, శస్త్రచికిత్సలు అందించడానికి ఆసక్తి చూపే వారు. దవాఖాన ఖాతాలో జమయ్యే 60% నిధులతో శస్త్రచికిత్సల సమయంలో ఆయా ఏజెన్సీల నుంచి తెప్పించిన పరికరాలకు డబ్బులు చెల్లించడంతోపాటు మిగిలిన నిధులను దవాఖాన నిర్వహణకు వినియోగించే వారు. ప్రస్తుతం నిధులు రాకపోవడంతో ప్రభుత్వ దవాఖానల్లో శస్త్రచికిత్సలను దాదాపుగా నిలిపివేశారు.
అత్యవసర సమయాల్లో పరికరాలను సరఫరా చేసే ఏజెన్సీలు కూడా బకాయిలు పేరుకపోవడంతో వాటిని పంపించడం లేదు. దీంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో సిబ్బంది రోగులను ప్రైవేట్ దవాఖానలకు రిఫర్ చేస్తున్నారు. నిజానికి, గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోగ్యశ్రీ బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఆరోగ్యశ్రీ కిం ద గత మార్చి వరకు రూ.2,407.51 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందని సభా సాక్షిగా చెప్పారు. ఇందులో ప్రభుత్వ దవాఖానలకు పాత వాటితో కలిపి రూ.927 కోట్లు, ప్రైవేట్ దవాఖానలకు రూ.1,480.51 కోట్లు చెల్లించినట్టు వివరంచారు. కానీ, రెండున్నరేండ్లుగా ఏ ఒక్క ప్రభుత్వ దవాఖానకు ఆరోగ్యశ్రీ కింద బకాయిల డబ్బులు రాలేదని దవాఖానల వ ర్గాలు చెప్తున్నాయి. మరి ముఖ్యమంత్రి చెప్పి న రూ.927 కోట్లు ఎవరికి వెళ్లాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్కార్ దవాఖానలకు బకాయిలు చెల్లించకుండా ఇదే విధా నం కొనసాగిస్తే, మున్ముందు ప్రభుత్వ దవాఖానలపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.