Rohit Sharma : వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) ఆడడంపై అనిశ్చితికి తెరపడడం లేదు. లార్డ్స్ వన్డేలో శతకంతో మెరిసినా ఈ మాజీ కెప్టెన్‌కు స్క్వాడ్‌లో చోటు దక్కుతుందన్న గ్యారంటీ లేదు. ఇప్పటికిప్పుడు వేటు పడకున్నా.. మెగా ఈవెంట్లో హిట్‌మ్యాన్ ఉంటాడా? లేదా? అనే సందేహం మాత్రం అభిమానులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో తన భవితవ్యం గురించి, వరల్డ్‌కప్ సన్నద్ధత గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది అక్టోబర్‌కు చాలా సమయం ఉందని కూల్‌గా పేర్కొన్నాడీ డాషింగ్ ఓపెనర్.
కెరీర్ చరమాంకంలో ఉన్న భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో ఉంటాడా? లేదా? అనేది ఉత్కంఠ రేపుతోంది. 50 ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ చివరి ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నా.. సెలెక్టర్లు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో హిట్‌మ్యాన్ ఏమాత్రం ఆందోళనకు గురవ్వట్లేదు. ప్రపంచకప్ సన్నద్ధత గురించి మాట్లాడిన అతడు వచ్చే ఏడాది అక్టోబర్ చాలా దూరం ఉంది. తొందర ఎందుకు అప్పుడు చూసుకుందాంలే అని తాపీగా చెప్పేశాడు. అంతేకాదు.. 2024లో టీ20 వరల్డ్‌కప్ విజయోత్సవంలో మాదిరిగా వన్డే ప్రపంచకప్ గెలిచాక బస్సు యాత్ర ఉండకపోవచ్చని రోహిత్ అన్నాడు. దాంతో.. తాను భారత స్క్వాడ్‌లో ఉండడం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడీ సిక్సర్ల వీరుడు.
Rohit Sharma broke his silence after being questioned about his participation in the World Cup 2027.https://t.co/2bzvL40BJ2
— Circle of Cricket (@circleofcricket) September 10, 2026
దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్ సమయానికి రోహిత్‌కు 40 ఏళ్లు వస్తాయి. దాంతో.. అతడిని ఓపెనర్‌గా ఆడించడం కంటే యువకుడైన యశస్వీ జైస్వాల్ బెటర్ అని సెలెక్టర్లు అనుకుంటున్నారు. కానీ, మాజీ క్రికెటర్లు మాత్రం అనుభవజ్ఞుడైన రోహిత్‌ను ఆడించాలని అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ సమీక్షా సమావేశం అనంతరం సెక్రటరీ దేవజిత్ సైకియా (Devjit Saikia) మాట్లాడుతూ హిట్‌మ్యాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘మీరు చూసే ఉంటారు. రోహిత్ గొప్పగా ఆడుతున్నాడు. మీకు ఇంకేం కావాలి. అతడి గురించి వస్తున్న వదంతులను నమ్మకండి ‘ అని సైకియా కామెంట్ చేశాడు. దాంతో.. ప్రస్తుతానికి వన్డే జట్టులో రోహిత్‌కు అవకాశముందనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు బీసీసీఐ కార్యదర్శి. ఈ సమావేశంలో ఓపెనర్‌గా యశస్వీకి అవకాశం ఇవ్వాలని చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కోచ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడగా.. తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్, టీ20 సారథి శ్రేయాస్ అయ్యర్లు మాత్రం రోహిత్ ఉండాల్సిందేనని పట్టుపట్టారని సమాచారం. ఎలాగైనా ప్రపంచకప్ స్క్వాడ్‌లో ఉండాలనే లక్ష్యంతో సాగుతున్న రోహిత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు.