హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిషరించాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో బుధవారం సీఎం పర్యటన సందర్భంగా జేఏసీ చైర్మన్ పుల్లగుర్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ‘శాశ్వత ఉద్యోగులతో సమానంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 50 శాతం పీఆర్సీ అమలుచేయాలి.
ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానంలో ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమచేయాలి. వేతన విధానానికి బదులుగా పేసేల్ విధానం అమలుచేయాలి. హెల్త్‌కార్డులు మంజూరు చేసి, ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు కల్పించాలి. రూ.కోటి ప్రమాద బీమాకు విధివిధానాలు రూపొందించాలి. తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకునేలా ఆయా శాఖలకు ప్రభుత్వం ఆదేశాలివ్వాలి. జీవో-1181ని ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.