ముంబై, అక్టోబర్ 1: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ శుక్రవారం నుంచి నిరసనలు ప్రారంభిస్తున్నామని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం ప్రకటించారు. దాదర్‌లోని శివాజీ పార్కులో శుక్రవారం సీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తుందని ముంబై ప్రెస్ క్లబ్లో ఆయన తెలిపారు.ఎన్నికల సం ఘం అధిపతిగా జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకునేంత వరకు నిరసనలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
గోవా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లో నిరసనలు జరుగుతాయి. ఆయన రాజీనామా చేయకపోతే, అక్టోబర్ చివరి నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతాం అని దీప్కే తెలిపారు. పౌర సమాజం భాగస్వామ్యంతో పారదర్శకమైన ప్రక్రియ ద్వారా సీఈసీ నియామకం జరగాలని డిమాండ్ చేశారు. 2025 నాటి ఓటర్ల జాబితాలో ఇకపై ఎటువంటి మార్పులు, చేర్పులూ చేయకూడదని, దానిని స్తంభింపచేయాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఈనెల 4న ముంబైలో ప్రదర్శన నిర్వహించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్), శివసేన(యూబీటీ) నిర్ణయించాయి.