కొమురవెల్లి, అక్టోబర్ 1 : ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుండటంతో తనకు పక్కా ఇల్లు వస్తుందన్న ఆశతో పాత ఇంటిని కూల్చుకున్న ఓ కుటుంబం ఇప్పుడు పశువుల కొట్టం ఆవరణలో గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్నది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన జిల్లా లింగం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి పాత ఇంటిని కూల్చి వేసి కుటుంబంతో కలిసి గుడిసెలోకి మారాడు. తన భార్య ఎల్లవ్వ పేరుతో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
తీరా గతంలో ఇల్లు మంజూరైనట్టు రికార్డులో చూపించడంతో నిర్ఘాంతపోవడం లింగం వంతైంది. తమకు ఇల్లు మంజూరు కాలేదని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరిష్కారం లభించలేదు. గుడిసెలో భిక్కుభిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. తన భార్య ఎల్లవ్వ పేరు మీద రాకుంటే కనీసం తన కోడలు పేరుమీద ఇల్లు మంజూరు చేయాలని కోరినా ఇల్లు రాదని చెబుతున్నారని లింగం ఆవేదన వ్యక్తం చేశాడు.