Volodymyr Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ విషయాన్ని నార్వే ప్రధాని జోనార్ గర్ స్టోర్ వెల్లడించారు. జెలెన్స్కీ ప్రయాణిస్తున్న విమానంపై డ్రోన్ దాడి జరిగిందని, ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారని జోనార్ వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలు ఇవి.
నార్వే కింగ్ హరాల్డ్ వి ఇటీవల మరణించారు. ఆయన అంత్యక్రియల కోసం జెలెన్స్కీ.. యూరప్ దేశమైన మోల్దోవా నుంచి నార్వే రాజధాని ఓస్లోకు విమానంలో వచ్చారు. అయితే, మంగళవారం సాయంత్రం మోల్దోవా నుంచి ఆయన విమానం బయల్దేరుతుండగా.. ఆ విమానంపై ఒక డ్రోన్ దాడి చేసిందని నార్వే ప్రధాని జోనాస్ తెలిపారు. అయితే, ఈ దాడి నుంచి జెలెన్స్కీ తప్పించుకున్నట్లు చెప్పారు. అతడు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లోనే బతుకుతున్నాడని జోనాస్ తెలిపారు. అయితే, జెలెన్స్కీ ప్రయాణించిన విమానం, ఆ డ్రోన్ ఎంత దగ్గరగా వచ్చింది వంటి వివరాల్ని ఆయన వెల్లడించలేదు.
మోల్దోవా ప్రభుత్వం కూడా ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. ఆయన విమానంపై జరిగిన దాడిలో ఉపయోగించింది రష్యా డ్రోన్ అని వివరించింది. ఈ డ్రోన్ దాడి తర్వాత అక్కడి ఎయిర్‌స్పేస్‌ను మోల్దోవా కొంతసేపు మూసేసింది. ఈ ఘటనతో జెలెన్స్కీ కూడా అక్కడే ఉండిపోయారు. అయితే, ఈ డ్రోన్‌ను అక్కడి సైన్యం కూల్చేసిన తర్వాత ఆయన విమానం వెళ్లేందుకు అధికారులు అనుమతించారు.