Antibiotics | భారత్‌లోని ఆసుపత్రుల్లో యాంటీ బయాటిక్స్‌కు నిరోధకత కలిగిన బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా కార్బపెనెమ్ వంటి శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌కు నిరోధకత కలిగిన గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఉన్న రోగుల్లో మరణించే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిస్థితి యాంటీ మైక్రోబయల్ నిరోధకతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. భారత్‌లోని 20 ప్రధాన వైద్య కేంద్రాల్లో ఆసుపత్రిలో చేరిన దాదాపు 1.6 లక్షల మంది రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 17.1 శాతం మందికి సూక్ష్మజీవుల పరీక్షల ద్వారా ఇన్ఫెక్షన్ నిర్ధారణ కాగా, మొత్తం రోగుల్లో 16.4 శాతం మందికి గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. ఈ రకమైన బ్యాక్టీరియాకు బయటివైపు రక్షణ కవచం ఉండటంతో సాధారణంగా ఉపయోగించే యాంటీ బయాటిక్స్‌ను ఎదుర్కొనే సామర్థ్యం వీటికి ఉంటుంది.
అధ్యయనంలో పాల్గొన్న గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్న రోగుల్లో 60 శాతానికి పైగా కార్బపెనెమ్ యాంటీ బయాటిక్స్‌కు నిరోధకత కలిగి ఉన్నట్లు గుర్తించారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు చివరి ప్రయత్నంగా తరచూ ఉపయోగించే ఈ యాంటీ బయాటిక్స్ పనిచేయకపోవడం చికిత్సను మరింత క్లిష్టతరం చేస్తోంది. కార్బపెనెమ్ నిరోధక ఇన్ఫెక్షన్లు ఉన్న రోగుల్లో ఆసుపత్రిలో మరణాల రేటు, కార్బపెనెమ్కు సున్నితంగా స్పందించే ఇన్ఫెక్షన్లు ఉన్న వారితో పోలిస్తే ఎక్కువగా ఉంది. అయితే ఇరు వర్గాల రోగులు ఆసుపత్రిలో గడిపిన సాధారణ వ్యవధిలో పెద్దగా తేడా కనిపించలేదు. యాంటీ బయాటిక్స్‌తో చికిత్స చేసినప్పటికీ బ్యాక్టీరియా వాటిని తట్టుకుని జీవించగలిగే పరిస్థితినే యాంటీ బయాటిక్ నిరోధకతగా పరిగణిస్తారు. గ్రామ్-నెగటివ్ ఇన్ఫెక్షన్లలో కార్బపెనెమ్ నిరోధకత ఉన్నవారిలో మరణాలు ఎక్కువగా ఉండటంతోపాటు చికిత్సకు అయ్యే ఖర్చు కూడా పెరుగుతున్నట్లు అధ్యయనం తెలిపింది. గతంలో నిర్వహించిన పరిశోధనలు కూడా కార్బపెనెమ్ నిరోధక గ్రామ్-నెగటివ్ రక్తప్రవాహ ఇన్ఫెక్షన్లు మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉన్నట్లు సూచించాయి. ముఖ్యంగా దక్షిణాసియాలో, అందులోనూ భారత్‌లో, ఈ సమస్య ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
భారత్‌లో ఇప్పటివరకు జరిగిన అనేక అధ్యయనాలు బ్యాక్టీరియా నమూనాల్లో కనిపించే నిరోధకతకు సంబంధించిన సమాచారానికే పరిమితమయ్యాయని పరిశోధకులు తెలిపారు. అయితే కార్బపెనెమ్ నిరోధక గ్రామ్-నెగటివ్ ఇన్ఫెక్షన్ల భారంతోపాటు వాటికి అందుతున్న చికిత్స, మరణాలపై బహుళ వైద్య కేంద్రాల్లో నిర్వహించిన సమగ్ర అధ్యయనం చాలా పరిమితంగా ఉందని పేర్కొన్నారు. అధ్యయనంలో పరిశీలించిన ప్రధాన బ్యాక్టీరియాల్లో ఈ.కోలి, క్లీబ్సియెల్లా న్యుమోనియే, అసినెటోబాక్టర్ బౌమానీ ఉన్నాయి. వీటిలో కార్బపెనెమ్ నిరోధకత ఉన్న ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగుల్లో మరణాల రేటు, కార్బపెనెమ్కు సున్నితంగా స్పందించిన ఇన్ఫెక్షన్లతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కార్బపెనెమ్ నిరోధక గ్రామ్-నెగటివ్ ఇన్ఫెక్షన్లు భారత్‌లో అధిక మరణాలకే కాకుండా ఎక్కువ కాలం ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితికి, చికిత్స ఖర్చులు పెరగడానికి కూడా కారణమవుతున్నాయని అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలో యాంటీమైక్రోబయల్ నిరోధకతపై సమగ్ర నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచించారు.
అలాగే ఇన్ఫెక్షన్ల నియంత్రణ, నివారణ చర్యలను విస్తరించడంతోపాటు యాంటీ బయాటిక్స్‌ను అవసరానికి అనుగుణంగా, సరైన విధానంలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇన్ఫెక్షన్లను సకాలంలో గుర్తించేందుకు అవసరమైన పరీక్షలను అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతమైన, అందుబాటు ధరలో ఉండే కొత్త యాంటీ మైక్రోబయల్ మందులకు ప్రాప్యతను మెరుగుపరచడం కూడా కీలకమని పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల చికిత్స ఫలితాలను మెరుగుపరచడంతోపాటు ఈ ఇన్ఫెక్షన్ల వల్ల రోగులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని తెలిపారు.