భీంగల్ / బాల్కొండ : భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై తిరుపతి ( SI Tirupati ) వేధింపులు ( Harassment ) తాళలేక నిరుపేద వెనుకబడిన తరగతికి చెందిన పొలాస సుధాకర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అత్యంత బాధాకరమని, దురదృష్టకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) అన్నారు.
రోడ్డు పక్కన టీస్టాల్ నడుపుకుంటూ జీవనం సాగించే ఒక సామాన్యున్ని పోలీసు అధికారి ప్రాణాల మీదికి తెచ్చే స్థాయికి వేధించడం గర్హనీయమని మండిపడ్డారు. భీమ్గల్ ఎస్సై తిరుపతి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయడం, అక్రమ ఇసుక వ్యాపారులతో చేతులు కలిపి దందాలు నడపడం, అమాయకులను పోలీస్ స్టేషన్కు పిలిపించి చితకబాది బూతులు తిడుతూ దౌర్జన్యాలు చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారని ఆరోపించారు.
ఈ అరాచకాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) దృష్టికి గతంలోనే పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మరింత బరితెగించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ప్రతి అరగంటకోసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యంతో నిరంతరం సమీక్షిస్తున్నానని చెప్పారు.
ఇప్పటికే హోప్ హాస్పిటల్ లో వైద్యానికి అతనికి రూ. 80 వేలు ఖర్చు కాగా తాను రూ. 50 వేలు వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్యే ప్రకటించారు. తదుపరి వైద్యఖర్చుల మొత్తం ప్రభుత్వము పోలీసులే భరించాలని డిమాండ్ చేశారు. స్వయాన బాధితుడే భీమ్గల్ పోలీసులపై ఆరోపణలు చేస్తుండగా నిజామాబాద్ సీపీ పోలీస్ ప్రమేయం లేదని బాధ్యతరహిత్యంగా మాట్లాడుతున్నాని పేర్కొన్నారు. వెంటనే ఎస్సై తిరుపతి పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతన్ని అరెస్ట్ చేసి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలనీ డిమాండ్ చేశారు.
భీమ్గల్ బందుకు పిలుపు
పోలీసు వేధింపులను నిరసిస్తూ మంగళవారం భీమ్గల్ పట్టణ బందుకు పిలుపు నిచ్చారు. భీంగల్ ప్రజలు, వ్యాపార వర్గాలు స్వచ్చదంగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు . బాల్కొండ నియోజకవర్గంలో పోలీసుల ఆగడాలు మితిమీరిపోయా యని ఆరోపించారు. భీమ్గల్ , బాల్కొండ, మోర్తాడ్ ఎస్సైల అరాచకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.