Rahul Gandhi : రక్షకులే రాక్షసుల్లా మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత (Congress Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. ప్రశ్నించే మహిళలను చూసి కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్‌షా (Amit Shah) ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మహిళలను అణచివేసే ధోరణి ఢిల్లీలో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఢిల్లీ (Delhi) పోలీసులు ఇటీవల మహిళలపై దాడులు, దురుసు ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు.
బాధితులకు న్యాయం చేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇటీవల జర్నలిస్టులు షహీన్ ఖాన్, నఫీసా ఖాన్‌లతో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని జర్నలిస్టులు తనతో చెప్పి ఆవేదన వ్యక్తంచేశారని రాహుల్ తెలిపారు. కెమెరాలు లాక్కొవడంతోపాటు వారిని ఈడ్చుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. వారి ఫిర్యాదుపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని పేర్కొన్నారు.
మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. పోలీస్‌స్టేషన్‌లోనే ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. రక్షించాల్సిన వారే వారికి ప్రమాదంగా మారుతున్నారని ఆరోపించారు. సాకేత్ పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఇటీవల పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.
ఈ సందర్భంగా మహిళా నిరసనకారులు, జర్నలిస్టులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.