నువ్వేం సీఎం? నీదేం భాష?
‘అసలు నువ్వేం సీఎంవు.. నీ భాషేంది? ఏమనుకుంటున్నవు? ఏదో అదృష్టం కలిసొచ్చి సీఎం అయినవ్ అంతే’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి 2 తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ ఎందుకు?
- ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఖజానా దోచి పెడుతున్నరు
- మూడేండ్లలో చేసింది గుండుసున్నా: రాజగోపాల్
- ఏదో అదృష్టం కలిసొచ్చి నువు సీఎం అయినవ్
- నిధులిమ్మంటే పండబెట్టి తొక్కుతా అంటవా!
- నిధుల్లేనప్పడు కొత్త టెండర్లు ఎందుకు?
- పైసలన్నీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీట్లకేనా?
- నీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు
- ఏ నిర్ణయానికైనా నేను వెనుకాడేది లేదు
- మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
నల్లగొండ ప్రతినిధి, నవంబర్18(నమస్తే తెలంగాణ)/మునుగోడు: ‘అసలు నువ్వేం సీఎంవు.. నీ భాషేంది? ఏమనుకుంటున్నవు? ఏదో అదృష్టం కలిసొచ్చి సీఎం అయినవ్ అంతే’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి 2 తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు కాకుంటే రూ.20 వేల కోట్లు తీసుకుపో.. కానీ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేనైన తాను నిధులు అడుగుతుంటే.. దాన్ని పాజిటివ్‌గా ఆలోచించాల్సింది పోయి.. పండబెట్టి తొక్కుతా అంటావా? ఏం తొక్కించుకునేటందుకు రాజగోపాల్‌రెడ్డి అంత ఈజీగా కనపడుతుండా నీకు?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘మూడేండ్ల పాలనలో తెలంగాణ ప్రజలెవ్వరూ సంతోషంగా లేరని, మిగిలి ఉన్న రెండేండ్లయినా మంచి పనులు చెయ్యి’ అంటూ హితవు పలికారు. మునుగోడుకు అన్యాయం చేస్తే తాను చూస్తూ ఊరుకోనని, సీఎంగా తండ్రి పాత్రలో ఉన్న మీరు అందరినీ సమానంగా చూడాలని, వివక్ష, పక్షపాతం చూపొద్దని, వెనుకబడిన నియోజకవర్గాలకు అన్యాయం చేయొద్దని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం చేయూత కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎంను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను, డిప్యూటీ సీఎంను, మంత్రులను ఇప్పటికే వందసార్లు నిధులడిగానని, ఇప్పుడు మళ్లీ అడుగుతున్నానని చెప్పారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్నగర్లేనా? అని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకున్నా పర్వాలేదని, మీరే పదవుల్లో ఉండండని, కానీ మునుగోడు, ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన నియోజకవర్గాల గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు. మునుగోడు లాంటి ప్రాంతాలకు పైసా ఇవ్వకుండా మీ సొంత నియోజకవర్గాలకే వేల కోట్ల నిధులు తీసుకెళ్తుంటే జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ ఎందుకు?
ఇప్పటికే ఉన్న సిటీకి దిక్కులేదని, ఇంకా ఫ్యూచర్ సిటీ ఎందుకు? ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చి కొత్త విషయాలు చెప్తే ప్రజలు హర్షిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తేల్చిచెప్పారు. అధికార పక్ష ఎమ్మెల్యేగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల దగ్గరికి తిరుగుతున్నా కానీ నిధుల్లేవని, ప్రభుత్వం వద్ద పైసల్లేవని అంటున్నారని, మరి పైసల్లేనప్పుడు కొత్త కొత్త టెండర్లు ఎందుకు? అని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలో రూ.1,500 కోట్లతో 300 రోడ్ల నిర్మాణ పనులకు అగ్రిమెంట్లు జరిగాయని, పనులు మొదలై ఏడాది దాటినా బిల్లులు రావడం లేదని తెలిపారు.
గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేనని చెప్పుకొన్నా, ఇప్పుడేమో అధికార పక్షమైనా ఏమీ చేయలేకపోతున్నా అని ఆవేదన వ్యక్తంచేశారు. మునుగోడు అభివృద్ధి కోసం ఇంకా కొట్లాడుతానని, 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని స్పష్టంచేశారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తే ఎలా? ఇవ్వాళ ఈ సీఎం ఉంటడు, రేపు పోతడు.. కానీ వీళ్లు చేసిన అప్పు ఎవరు కట్టాలని ప్రశ్నించారు.
మరో కురుక్షేత్రానికి సిద్ధమే
మునుగోడుకు అన్యాయం చేసినా, ప్రజల సొమ్ము దోచుకున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని, మునుగోడు మరో కురుక్షేత్రానికి వేదిక అవుతుందని రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. అధికారంలో ఉన్నోళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని, ఒక్క రూపాయి వృథా చేసినా మునుగోడు నుంచి రాజన్న సైన్యం తెలంగాణ కోసం కదులుతదని, అధికారం ఉన్నదని ఏది చేసినా చెల్లుతుందనుకొంటే యుద్ధం మొదలైనట్టేనని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలకులు తప్పు చేస్తే గతంలో మాదిరి నిర్ణయానికి వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. తాను పదవుల కోసం, కాంట్రాక్టర్ల కోసం పనిచేసే మనిషిని కాదని, సీఎం రూ.5 వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తామన్నా 20శాతం లెస్తో పనిచేసి చూపి ప్రజల సొమ్ము కాపాడే మనిషినని చెప్పారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చానని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పటికే మూడేండ్లు అయిపోయిందని, ఏమీ చేయలేకే అధికారుల ముందే ప్రభుత్వాన్ని తిట్టాల్సి వస్తుందని చెప్పారు.
రాహుల్ చెప్పినా పట్టింపేది?
‘కాంగ్రెస్ ఎన్నికల హామీలో 4 వేల పెన్షన్ ఇస్తమని చెప్పినం. మహిళలకు 2,500 ఇస్తామన్నం. ఇవే విషయాలు నేను మునుగోడులో ఊరూరూ తిరిగి చెప్పిన. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నరు. స్వయనా ఇదే విషయాన్ని రాహుల్‌గాంధీ కూడా చెప్పారు. కానీ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?’ అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ‘మూడేండ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. మిగిలిన కాలమైనా మంచి పాలన చేయండి. మునుగోడుకు నిధులివ్వండి. నాకు మంత్రి పదవిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకొంటే ఆలోచిస్తా. నాకు పదవుల కోసం సీఎం, డిప్యూటీ సీఎం ఇండ్ల చుట్టూ తిరిగే అలవాటు లేదు. నేను ఆత్మగౌరవం ఉన్న నేతను’ అని చెప్పారు. మంత్రి పదవి రాలేదనే కారణంతో మాట్లాడుతున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే తన నైజమని తేల్చి చెప్పారు.
ఆంధ్రా కాంట్రాక్టర్లదే హవా
‘కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్లే పనులు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వారి దోపిడీ ఇంకెన్నాళ్లు? వారి కనుసన్నల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఏమనుకోవాలి?’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చుకొంటే మూడేండ్లలో వారికి న్యాయం జరుగలేదని, ఎంతో మంది ఆశలు అడియాశలయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పదవుల్లో ఉన్నోళ్లే ఈ ప్రభుత్వంలోనూ ముందు సీట్లో కూర్చున్నారని, తెలంగాణ కోసం కొట్లాడినోళ్లకు ఏమీ లేదని అంతా గుండుసున్నానే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పాలనలో అధికారపక్ష ఎమ్మెల్యేనై ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పుడు ఇస్తున్న పింఛన్లలోనూ 10శాతం వరకు అనర్హులే ఉన్నారని, పేదలకు న్యాయం జరిగే వరకు తాను ఊరుకోబోనని స్పష్టంచేశారు. నియోజవర్గ సమస్యలపై నాలుగు గోడల మధ్య వినతిపత్రాలిస్తే పట్టించుకోవడం లేదని, అదే బయట వేదికలపై మాట్లాడితే పార్టీ క్రమశిక్షణ పేరుతో కట్టడి చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

