‘బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఫీజులు పూర్తిగా రద్దు చేస్తాం. నిరుద్యోగుల కన్నీళ్లు తుడుస్తాం’ అంటూ నాడు టీసీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ఎన్నికల సభల్లో కపట ప్రేమను నటించారు. నిరుద్యోగులకు నమ్మకం కలిగించేలా తమ అభయహస్తం మ్యానిఫెస్టోలోనూ ఆ అంశాన్ని పొందుపర్చారు. నిరుద్యోగులను మాయపుచ్చి, వారి ఓట్లతో అధికారం చేపట్టిన వెంటనే రంగు మార్చారు. ఇప్పుడు ఒక్కో నోటిఫికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000 వసూలు చేస్తున్నారు. దీనికి ఎగ్జామ్ ఫీజు రూ.120 అదనం.
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల వెతలు తెలిసిన మహానేత కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రాసెసింగ్ ఫీజును ఎప్పుడూ రూ.200 మించి పెంచలేదు. అవసరమైతే దానికి ఎగ్జామ్ ఫీజు మరో రూ.80, రూ.120గా నిర్ధారించేవారు. అలాంటిది ఎన్నికల ప్రచారాల్లో నిరుద్యోగుల భావోద్వేగాలతో ఆడుకుంటూ.. వారికి మాయమాటలు చెప్పడంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. నిరుద్యోగుల దగాహస్తంగా పేరుగాంచిన అభయహస్తం మ్యానిఫెస్టోలోనూ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారినుంచి ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోబోమని పొందుపర్చారు. అలా మాటిచ్చి.. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని నోటిఫికేషన్లకు కేసీఆర్ ప్రభుత్వం నిర్దేశించిన నామమాత్రపు ఫీజులను సుమారు 400 శాతం పెంచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు పూర్తిగా ఉచితంగా ఇస్తామంటూనే వేల రూపాయల ఫీజులు పెంచి.. నిరుద్యోగులను ఆర్థికంగా నట్టేట ముంచుతున్నారు. డీఎస్సీ-2024లో ఒకో పోస్టుకు 1,000 ఫీజు విధించారు. ఒక అభ్యర్థి ఎస్జీ, సూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ వంటి నాలుగు పోస్టులకు దరఖాస్తు చేస్తే రూ.4,000 వరకు చెల్లించాల్సి వచ్చింది.
ఫీజులతో జేబులు నింపుకుంటుర్రు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు ఫీజుల భారం భారీగా పెరిగిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 20 వరకు నోటిఫికేషన్లు ఇచ్చినా.. వాటి ద్వారా కనీసం 20 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయింది. గత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 16 నోటిఫికేషన్ల ద్వారా 16,978 పోస్టులు భర్తీ చేశారు. మిగతావన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లేనని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నవాటిని క్లియర్ చేసి ఇచ్చామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సుమారు 20 నోటిఫికేషన్ల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులైన బీసీ, ఓసీల నుంచి రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు రూ.120, రూ.80గా వసూలు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి రూ.500 ప్రాసెసింగ్ ఫీజు, రూ.120 ఎగ్జామ్ ఫీజు పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నారని నిరుద్యోగులు చెప్తున్నారు. ఆ డబ్బులతో తమ జేబులు నింపుకొంటున్నారే కానీ.. నిరుద్యోగుల బాధలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు కొలువుల్లో కొత్తగా ‘వన్ టైమ్ ఫీ’
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అతి తక్కువ పోలీసు కొలువుల నోటిఫికేషన్లో కొత్తగా ‘వన్ టైమ్ ఫీ’ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా నిరుద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ కోట్లాది రూపాయలు వసూలు చేసేవిధంగా రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచించింది. టీజీపీఎస్సీ పోస్టుల నోటిఫికేషన్లకు ఒక్కో అభ్యర్థికి ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000గా ఉండగా.. పోలీసు ఉద్యోగాల్లో బీసీ, ఓసీ ఎస్సై, ఏఎస్సై అభ్యర్థులకు ‘వన్ టైమ్ ఫీ’ ఏకంగా రూ.1,500కు పెంచేశారు. ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750గా నిర్ణయించారు. ఇదే నోటిఫికేషన్లో కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు సైతం ఏకంగా రూ.1,200 బీసీ, ఓసీ అభ్యర్థులకు.. రూ.600 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నిర్ణయించి.. భారీగా దండుకునేలా రేవంత్‌రెడ్డి సర్కార్ పథకం రచించిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 8 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకుంటే ఈ వన్ టైమ్ ఫీజు ద్వారా దరఖాస్తు దశలోనే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయని చెప్తున్నారు.
పోలీసు అభ్యర్థుల జేబులకు చిల్లు
మునుపెన్నడూ లేనివిధంగా వన్‌టైమ్ ఫీజు భారీగా పెంచడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. అభ్యర్థులు అర్హత సాధించకపోతే.. వారి నుంచి వసూలు చేసే సొమ్మంతా ప్రభుత్వం తమ ఖాతాల్లో వేసుకున్నట్లేనని వాపోతున్నారు. ఇకపోతే నాలుగేండ్లుగా పోలీసు కొలువుల కోసమే ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అతితక్కువ పోస్టులే విడుదల చేసినా.. వారు అన్ని ఎస్సై స్థాయి.. కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకుంటారు. ఎస్సై స్థాయిలో సివిల్, ఏఆర్, టీజీఎస్పీ, ఎస్ఏఆర్సీపీఎల్, ఎస్పీఎఫ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ వంటి కేటగిరీల్లో దరఖాస్తు చేసుకుంటే కనీసం రూ.3,000 వరకూ ఖర్చు భరించాల్సి వస్తున్నది. అలాగే కానిస్టేబుల్ స్థాయి పోస్టుల్లో సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్సీపీఎల్, ఎస్పీఎఫ్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్, డ్రైవర్, మెకానిక్ విభాగాల్లో దరఖాస్తు చేసుకున్నా.. వారికి కూడా రూ.3,000 వేలకు పైగా ఖర్చు అవుతుందని, ఇదంతా తమకు భారమేని నిరుద్యోగులు వాపోతున్నారు.
400 శాతం ఫీజుపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కి పెంచడంపై జాతీయ మానవ హకుల కమిషన్‌లో ఇటీవల ఫిర్యాదు నమోదైంది. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజును ఏకంగా 400 శాతం పెంచడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. టీజీపీఎస్సీ ఇటీవల ఆర్ అండ్ బీ శాఖలో 222 ఏఈఈ (సివిల్), 49 ఏఈఈ (ఎలక్ట్రికల్) పోస్టులు, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, పాఠశాల విద్యాశాఖలో 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒకే తరహా కొలువులకు ఒకేసారి కాకుండా వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల అభ్యర్థులు ప్రతి దరఖాస్తుకూ ఫీజులు చెల్లించాల్సి వస్తున్నదని వై బాలచందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేరొన్నారు. పెంచిన ఫీజుల అమలును తక్షణమే నిలిపివేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విడుదల చేసిన కొన్ని నోటిఫికేషన్లు, ఫీజుల వివరాలు
