ఖమ్మం అంబేద్కర్, టీటీడీసీ భవనాల్లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ నిరాశ్రయులను అధికారులు గురువారం గెంటేయడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. 750 మంది ఇళ్లను కూల్చిన ప్రభుత్వం 412 మంది పట్టాలిచ్చిందని అన్నారు. తమకు కూడా న్యాయం చేస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని మిగిలిన 338 మంది బాధితులు అధికారులతో అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు అంబేద్కర్ భవన్ నుంచి వెళ్లబోమంటూ తమ కుటుంబాలతో కలిసి అక్కడే ఉన్నారు. అర్హులకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ ప్రక్రియ బుధవారమే ముగిసిందని గురువారం అక్కడికొచ్చిన ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పష్టం చేశారు. తమకు న్యాయం చేసేదాకా వెళ్లబోమని బాధితులు చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీ పోలీసు బలగాలతో వచ్చి బలవంతంగా ఖాళీ చేయించారు.
ఖమ్మం అంబేద్కర్ భవన్లో గురువారం వెలుగుమట్ల బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. తొలుత భూదాన్ భూముల్లో వారు నిర్మించుకున్న ఇళ్లను గత నెల 24న నేలమట్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారిని, వారి సామాన్లను అక్కడి నుంచి తీసుకొచ్చి ఖమ్మం టీటీడీసీ, అంబేద్కర్ భవన్లలోని పునరావాస కేంద్రాల్లో పడేసింది. ఆకలిదప్పులను, కనీస సౌకర్యాలను విస్మరించింది. ఇన్ని రోజులూ బీఆర్ఎస్ నేతలు అందించిన అన్నపానీయాలు మినహా ప్రభుత్వం నుంచి కనీస ఆదరణ కూడా కరువైంది. అయినప్పటికీ అన్నింటినీ తట్టుకొని, సౌకర్యాల లేమిలోనే ఇన్నాళ్లూ అక్కడ కాలం వెళ్లదీశారు. ఎప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న ఆశతోనూ, గూడు కోల్పోయిన తాము మరెక్కడికి వెళ్లాలో తెలియని దిక్కుతోచని స్థితితోనూ అక్కడే పడి ఉన్నారు. బాధితుల ఆందోళన, బీఆర్ఎస్ పోరాటం ఫలితంగా దిగొచ్చిన ప్రభుత్వం అర్హులకు న్యాయం చేస్తామని మాట ఇచ్చింది. అదే భూదాన్ భూముల్లో 75 గజాల చొప్పున స్థలం కేటాయిస్తామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.
కానీ, మొత్తం 750 ఇళ్లను కూల్చిన ప్రభుత్వం.. బుధవారం నాడు 311 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేసింది. మరో 101 మందికి వారి స్వగ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పింది. కానీ, 750 కుటుంబాలకు 412 మంది లెక్క తేల్చిన ప్రభుత్వం.. మిగిలిన 338 మంది గురించి కనీసంగానూ ప్రస్తావించలేదు. జాబితాలో వారి పేర్లు లేకపోవడం వల్ల వారంతా అనర్హులేనన్న ముద్ర వేసింది. వారిని గురువారం అంబేద్కర్ భవన్, టీటీడీసీల్లోని పునరావాస కేంద్రాల నుంచి బలవంతంగా వెళ్లగొట్టింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పారిశుధ్య ట్రాక్టర్లలో బాధితుల సామాన్లు వేసి పంపించి వేసింది. దీంతో ఆ 338 మంది బాధితులు అధికారుల ఎదుట గుండెలు బాదుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు మరెక్కడా ఇళ్లు లేవని, తమకు అన్యాయం చేయొద్దని వేడుకున్నారు. అయినా కనికరించని అధికారులు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితుల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. పునరావాస కేంద్రం నుంచి సామాన్లు తీసుకొని వెళ్లకపోతే కేసులు పెట్టించి జైళ్లలో వేయిస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కన్నీటిని దిగమింగుకుంటూ కొందరు బాధితులు తాము తెచ్చుకున్న ఆటల్లో తమ సామాన్లు ఎక్కించుకొని ‘ముల్లె సదురుకున్న ఎల్లిపోతావున్న.. ఈ ఊల్లె నాకింక ఏమున్నదక్కా..’ అంటూ గోడున విలపిస్తూ వెళ్లిపోయారు.

తొలుత వెలుగుమట్ల భూదాన్ భూముల్లోంచి, ఇప్పుడు పునరావాస కేంద్రాల్లోంచి రేవంత్ సర్కారు గెంటివేయడంతో బాధితులందరూ గూడు చెదిరిన పక్షులయ్యారు. ఇన్నాళ్లూ పునరావాస కేంద్రంలో చెట్ల కింద ఉన్న నిరుపేదలను.. ఇప్పుడు అక్కడి నుంచి కూడా వెళ్లగొట్టడంతో అరణ్యరోదనలైన ఆర్తనాదాలతో బయటకు వెళ్లిపోయారు. న్యాయం చేస్తామంటూ ఇన్నాళ్లుగా నమ్మించిన ప్రభుత్వం.. మళ్లీ అన్యాయం చేయడంతో బరువెక్కిన గుండెలతో బయటకు నడిచారు. తామూ కటిక పేదలమని, అయినా తమ పేర్లు జాబితాలో లేవని రోదించినా, మొరపెట్టుకున్నా ప్రభుత్వం కనీసమాత్రంగానూ పట్టించుకోలేదు. పైగా, కాంగ్రెస్ సర్కారు ఆదేశాల మేరకు అంబేద్కర్ భవన్‌కు వచ్చిన అధికారులు కనికరం లేకుండా ప్రవర్తించారు. ప్రభుత్వ ఆదేశాలున్నందున ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. లేకుంటే కేసులు పెడతామంటూ భయబ్రాంతులకు గురిచేశారు. తాము అర్హులమేనంటూ, తాము పేదలమేనంటూ కన్నీటి పర్యంతమైనా సదరు అధికారులు కాఠిన్యాన్ని వీడలేదు. భూదాన్ భూముల్లో తాము కట్టుకున్న ఇళ్ల ఫొటోలను, కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చుతున్నప్పడు తీసిన వీడియోలను చూపిస్తూ రోదించినా ప్రభుత్వం ముందు ఆ రోదనలు అరణ్యరోదనలే అయ్యాయి. న్యాయం చేస్తామంటూ తమ వద్ద దరఖ్తాస్తులను, పత్రాలను తీసుకున్న ప్రభుత్వం మళ్లీ అన్యాయమే చేసిందంటూ, అనర్హుల జాబితాలో చేర్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మణుగూరు టౌన్, మార్చి 12: ఖమ్మం భూదాన్ భూముల్లో ప్రభుత్వం నిరుపేదల ఇండ్లు కూల్చిన నాటి నుంచి వారి పక్షాన నిలిచించి తమ పార్టీయేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. తమ పోరాట ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిందని పేర్కొన్నారు. మణుగూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల ఇళ్లను రాత్రికి రాత్రే బుల్డోజర్లతో కూల్చివేసి వారిని రోడ్డున పడేసిన పాలకులు.. ఇప్పుడు తీరిగ్గా ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందని, హత్య చేసినోడే సానుభూతి చూపినట్లుగా అనిపిస్తోందని విమర్శించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పేదలను పెయిడ్ ఆర్టిస్టులంటూ మంత్రి అనడం సరికాదని అన్నారు. పునరావాస కేంద్రం నుంచి బాధితులను ఖాళీ చేయిస్తున్నారని, కానీ అసలైన బాధితుల పేర్లు జాబితాలో లేకుండా చేశారని అన్నారు. సుమారు 720 కుటుంబాలుండగా కేవలం 311 మందికే పట్టాలిచ్చి మిగతా పేదలకు మొండిచూపడమేమిటని ప్రశ్నించారు. మంత్రులు తమ తప్పును ఒప్పుకొని చెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. భూదాన్ చుట్టూ ఉన్న భూములు మంత్రులు, వారి బంధువులవేనని అన్నారు. అందుకే పేదలను వెళ్లగొట్టే దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. 16 నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అందరూ నిలదీస్తారనే ఉద్దేశంతోనే హడావిడిగా పట్టాలు పంచారని ఆరోపించారు.
ఖమ్మం సిటీ, మార్చి 12: ఖమ్మం వెలుగుమట్లలో నిజమైన భూదాన్ బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని పలువురు బాధితులు అన్నారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కొంతమంది అనర్హులకు, అక్రమార్కులకు, పైరవీకారులకు బుధవారం పట్టాలు పంపిణీ చేశారని ఆరోపించారు. తాము ఎనిమిదేళ్లుగా భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నా ప్రభుత్వం సక్రమంగా సర్వే జరపించకుండా, అసలైన పేదలను గుర్తించకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. మరోసారి రీ సర్వే జరిపించి లబ్ధిదారులను గుర్తించి తమను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో బాధితులు సత్యనారాయణరెడ్డి, నరగాని కోటేశ్వరరావు, రవి, సీతారాములు, కల్యాణి, కవిత, జయమ్మ, సిరికొండ కల్యాణి, గాదె భాగ్యలక్ష్మి, పసుమర్తి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం అంబేద్కర్, టీటీడీసీ భవనాల్లో ఆశ్రయం పొందుతున్న భూదాన్ బాధితులను పోలీసు, రెవెన్యూ అధికారులు గురువారం బలవంతంగా వెళ్లగొట్టారు. ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి సామాన్లతో సహా వారిని బలవంతంగా తరలించారు. మొదట పట్టాలురాని పేదలు అధికారుల తీరుపై తిరగబడ్డారు. ఉండడానికి నిలువ నీడ లేకుండా చేసి ఇప్పుడు బలవంతంగా వెళ్లగొడితే సామాన్లతోపాటు తాము ఎక్కడికి వెళ్లాలంటూ నిలదీశారు. న్యాయం చేసే వరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ అధికారులు వినలేదు. అంబేద్కర్ భవనంలో ఉన్న సామగ్రిని తీసుకొని వెళ్లిపోకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పేదలందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందులో చాలామంది మళ్లీ కొద్దోగొప్పో అప్పు తెచ్చుకొని సుదూర ప్రాంతాల్లో, సౌకర్యాల లేమిలో ఉన్న ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఆ ఇళ్లకు వెళ్లిపోయారు.
ఈ ఫొటోలో ఇంటి ముందు నిలుచున్న మహిళ పేరు సోమా ఉమారాణి. భూదాన్ భూముల్లో ఇల్లు కట్టుకొని బతుకుదెరువు కోసం కిరాణం షాపు నడుపుకుంటూ ఎనిమిదేళ్లుగా అక్కడే జీవిస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బుల్డోజర్లు ఈమె ఇంటిని నేలమట్టం చేశాయి. దీంతో ఆమెకంటూ ఇల్లు లేకుండా చేశాయి. జిల్లాకు చెందిన మంత్రులు బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో భూదాన్ బాధితులకు అందించిన పట్టాల్లో ఉమారాణి పేరు లేదు. అదేమిటని అధికారులను ప్రశ్నిస్తే.. ‘నీకు అసలు అక్కడ (భూదాన్ భూముల్లో) ఇల్లే లేదు’ అంటూ సమాధానమిచ్చారు. ‘అసలు విచారణకు రాకుండానే నాకు అక్కడ ఇల్లు లేదంటే ఎలా? అసలు బాధితురాలినే కాదంటే ఎలా అంటూ ఉమారాణి కన్నీరుమున్నీరుగా రోదించింది.
ఈ ఫొటోలోని మరో మహిళ పేరు వల్లభనేని ప్రమీల. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చకముందు భూదాన్ భూముల్లో తాను నిర్మించుకున్న ఇంటి ముందు తీసుకున్నట్లు ఫొటో. ఈ ఫొటోను చూపుతూ ఖమ్మం అంబేద్కర్ భవన్ వద్ద గురువారం ఆమె కన్నీటి పర్యంతమైంది. కూలి పనులు చేసుకొని రూ.10 లక్షలు కూడబెట్టి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా కూల్చివేసిందని వాపోయింది. ఉండడానికి గూడు లేకుండా చేసి వీధిన పడేసిందని కన్నీటి పర్యంతమైంది. ఇప్పుడేమో తాను అనర్హురాలినంటూ పూర్తిగా వెళ్లగొడుతోందంటూ గుండెలు బాదుకుంది. ఇల్లు కూల్చిన తరువాత ఇక్కడే(అంబేద్కర్ భవన్లో) ఉన్నానని, న్యాయం చేస్తామంటే అనేక పర్యాయాలు అధికారులకు ఆధార్ కార్డులు ఇచ్చానని అంటోంది. కానీ, అధికారులు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే తాను అనర్హురాలినంటున్నారని, తనను ఇక్కడి నుంచి వెళ్లగొడుతున్నారని కన్నీటి పర్యంతమైంది.
ఈ ఫొటోలో తన ఇద్దరు పిల్లలను చూపుతూ రోదిస్తున్న వ్యక్తి పేరు మట్టా నరేశ్. వెలుగుమట్ల భూదాన్ బాధితుడు. ప్రేమ వివాహం చేసుకున్న నరేశ్.. కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడంతో తొమ్మిదేళ్ల క్రితం వెలుగుమట్ల గుట్టల్లోని భూదాన్ భూముల్లో గుడిసె నిర్మించుకొని నివాసం ఉంటున్నాడు. తన ఇద్దరు పిల్లలు కూడా అక్కడే జన్మించారు. తనకు మరెక్కడా ఇంటి స్థలం లేదని వాపోయాడు. అధికారులేమో అర్హుల జాబితాలో తన పేరు లేదంటున్నారంటూ వాపోయాడు. తన పేరుతో గానీ, తన కుటుంబ సభ్యుల పేరుమీద గానీ మరెక్కడా ఇంటి స్థలంగానీ, ఇల్లుగానీ లేదని నెత్తీనోరూ బాదుకున్నాడు. ఒకవేళ ఉందని ప్రభుత్వం చూపిస్తే అక్కడికే వెళ్లి ఇల్లు కట్టుకొని ఉంటానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదీ.. ఖమ్మం భూదాన్ భూముల్లో ఇంకా పట్టాలు అందని వందలాది మంది పేదల గోడు.
అంబేద్కర్ భవన్లో ఉన్నోళ్లంతా ఇళ్లు కూల్చివేయబడిన వాళ్లే. అయితే, బుధవారం పట్టాలు పొందిన వారిలో కొందరు అనర్హులే ఉన్నారు. మున్సిపల్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్లకే పట్టాలు ఇచ్చారు. భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకున్నోళ్లంతా ఇక్కడే ఉన్నారు. మేం అనర్హులం కాదు. మేమే అసలైన భూదాన్ బాధితులం. ప్రభుత్వం సర్వే చేసి అసలైన బాధితులకు న్యాయం చేయాలి. అప్పటిదాకా రోడ్ల మీదనే ఉంటాం. ఎక్కడికీ వెళ్లం.
ఉన్న ఇంటిని కూల్చివేశారు. మాకు న్యాయం చేయకుంటే కుటుంబంతో సహా పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు మరో మార్గం లేదు. కష్టపడి కట్టుకున్న ఇంటిని నిట్టనిలువునా కూల్చివేసి మమ్మల్ని రోడ్డున పడేశారు. ఇప్పుడేమో ఉన్నట్టుండి అంబేద్కర్ భవనం నుంచి వెళ్లిపోవాలంటున్నారు. ఈ సామన్లు తీసుకొని ఎక్కడికి పోవాలి. పోలీసులు మా సామాన్లను తీసి ఆటోలో వేసి పంపిస్తుంటే బయట ఆపి రోడ్డు పక్కన దింపుకున్నా. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ప్రజా ప్రభుత్వమంటే ఇదేనా?
సర్వేకి వచ్చినప్పుడు మా వద్ద ఉన్న ఇంటి ఆధారాలు కూడా చూడలేదు. కనీసం వాటి గురించి అడగలేదు. ఇళ్లు కూల్చినట్లుగా ఎలాంటి ఆధారాలు లేని వాళ్లకు బుధవారం పట్టాలు ఇచ్చారు. కానీ, గడిచిన పది సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాం. ఇంటి బిల్లులు కట్టాం. కరెంటు మీటర్లు పెట్టుకున్నాం. ఇంటికి కొంత డబ్బులు పోగేసుకొని కరెంటు స్తంభాలూ వేసుకున్నాం. కానీ, ఇప్పుడేమో మమ్మల్ని అనర్హులంటున్నారు. వెళ్లగొడుతున్నారు. పదేళ్లుగా అక్కడే ఉంటున్న మేం అనర్హులమెలా అయ్యాం?
ఎన్నో ఏళ్లుగా వెలుగుమట్ల భూదాన్ భూమిలో గుడిసె కట్టుకొని బతుకుతున్నా. గత నెల 24న అధికారులు బుల్డోజర్తో వచ్చి మా గుడిసెను కూల్చారు. సామాన్లతో తీసుకొచ్చి ఈ అంబేద్కర్ భవన్లో పడేశారు. ఇప్పుడేమో నాకు ఇంటి పట్టా ఇవ్వబోమని అంటున్నారు. ఈ సామాన్లు తీసుకొని నేను ఎక్కడికి పోవాలి? కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమంటే ఇదేనా? నాకు ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టియ్యాలి. రేవంత్‌రెడ్డి సారూ.. నాకు న్యాయం చేయండి.