Pradeep Rawat | భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి చెందడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన మంగళవారం (ఆగస్టు 4) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ ముంబైలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2022లో ప్రదీప్ రావత్‌కు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి ఆయన నిరంతరం చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. గత నెల రోజులుగా ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత విషమించింది.
ప్రదీప్ రావత్‌కు అత్యంత సన్నిహితుడైన సిద్ధార్థ్ తివారీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయన శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు.ప్రదీప్ రావత్ అంత్యక్రియలు బుధవారం (ఆగస్టు 5) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, సినీ ప్రముఖులు, స్నేహితులు చివరి చూపు చూసేందుకు ఆయన పార్థివ దేహాన్ని ముంబైలోని గోరేగావ్‌లో ఉన్న ఆయన నివాసంలో ఉంచనున్నారు.ఇక ప్రదీప్ రావత్ తన సినీ జీవితంలో దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడిగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. నివేదికల ప్రకారం ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.41 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అయితే దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రదీప్ రావత్‌కు భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు ఆయన ప్రయత్నించేవారని సన్నిహితులు చెబుతున్నారు.ఆయన నటించిన చివరి కన్నడ చిత్రం ‘త్రిశూలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. తన గంభీరమైన స్వరం, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, సహజమైన నటనతో భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ప్రదీప్ రావత్ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటుగా మారింది. ఆయన పోషించిన భిక్షు యాదవ్, గజినీ ధర్మపాల్ వంటి పాత్రలు సినీ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.