అమరావతి : ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఉన్న ట్యాబ్లెట్లను తయారు చేసే టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడే నైట్‌షిఫ్ట్‌లో ఉన్న ఇద్దరు కార్మికులు ప్రమాద ధాటికి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని స్థానిక తడ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయారు. మరో పదిమందికి తీవ్ర గాయాలు కాగా వారికి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఏపీకి చెందిన వాసు (38), చిన్న మస్తాన్ (45), తమిళనాడుకు చెందిన మోహన్ (20), రమేశ్ (45) అలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌరబ్ రాయ్ (36)గా గుర్తించారు. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.