చెన్నూర్ టౌన్ : చెన్నూర్ నియోజకవర్గంలో దళిత నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ, బురద చల్లే ప్రయత్నం చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి పీఏ రమణా రావు (Ramana Rao)పై వెంటనే కేసు నమోదు చెయ్యాలని డాక్టర్ రాజా రమేష్ (Raja Ramesh) డిమాండ్ చేశారు. దళిత సంఘాలను ఎరవేసి మంత్రి పదవి సంపాదించుకున్న వివేక్ అగ్రకులాల వారితో దళితులపై ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయించడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
చెన్నూరు మున్సిపాలిటీలో ఉన్న పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను కలిసి రమణా రావు పైన ఫిర్యాదు చేసి.. కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. గతంలో పేపర్ కట్టింగ్స్ ఫార్వర్డ్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు నమోదు చేసిన పోలీసులు ఈసారి ఏవిధంగా స్పందిస్తారో చూస్తామని రమేష్ తెలిపారు. ఒకవేళ మంత్రి అధికారానికి తలొగ్గి తగిన న్యాయం చెయ్యక పోతే రామగుండం సీపీకి కంప్లైంట్ ఇచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు రమేష్.
దళితుల పై జరిగుతున్న దాడులను ఆపాల్సిన వివేక్ వెంకటస్వామి.. అగ్రవర్ణాలకు కొమ్ము కాయడం బాధాకరమని, ఇలాంటి సంఘటనలు మరోసారి జరిగితే తగిన బుద్ధి చెబుతామని ఆయన పేర్కొన్నారు.
మంత్రి వివేక్ వెంకట స్వామికి చేతనైతే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు రమేష్. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను అమలు అయ్యేటట్టు చూడాలని, మీడియా చేతిలో ఉందని దళితులపై అసత్యపు ప్రచారాలు చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నవొజొద్దీన్, మాజీ సర్పంచ్ కృష్ణ, బీఆర్ఎస్, యువ నాయకులు సురేష్, మహేందర్, కొప్పుల రవీందర్, రవి, చిరంజీవి, నాయబ్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.