రామగిరి, ఫిబ్రవరి 28 : తెలంగాణలో హోలీ పండుగను మార్చి 3వ తేదీన నిర్వహించుకోవాలని, ఇదే విషయాన్ని తెలంగాణ విద్వత్ సభలోని పెద్దలు, పండితులు నిర్ణయం చేశారని దీనిపై ఎలాంటి అపోహాలకు, సందేహాలకు అవకాశం లేదని తెలంగాణ డీడీఎన్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నల్లగొండ జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, ప్రముఖ పురోహితులు పెన్నా మోహనశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 3న గ్రహణం ఉందని, ఆరోజు హోలీ నిర్వహించుకోవద్దని పలువురు పండితులు, పీఠాదిపతులు సోషల్ మీడియా, ఇతర మాద్యమాల్లో సందేశాలు వ్యాప్తి అవుతున్నందున వాటిని నమ్మవద్దన్నారు. ఆ రోజు సంభవించే సూర్యగ్రహణం భారతదేశంలో ఎలాంటి ప్రభావం లేదని, తెలంగాణకు ఎలాంటి ప్రభావం లేదని తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో అదే రోజు హోలీ పండుగను నిర్వహించుకోవాలని పేర్కొన్నారు.