న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల నాటో సమావేశాల్లో పాల్గొన్న తర్వాత టర్కీ రాజధాని అంకారా నుంచి తిరిగివెళ్లే సమయంలో ఆయన సీక్రెట్ విమానం వాడిన విషయం తెలిసిందే. సీక్రెట్ సర్వీస్ చెప్పినట్లు తాను ప్లేన్‌ను మార్చానని ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. అంకారా విమానాశ్రయంలో ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కిన ట్రంప్.. ఆ తర్వాత క్యాటగరింగ్ ట్రక్కులోకి మారి.. దాని నుంచి ఓ సీక్రెట్ మిలిటరీ విమానంలో లండన్ వెళ్లారు. అయితే గతంలో అమెరికా మాజీ దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్(Bill Clinton) కూడా ఇలాగే సీక్రెట్ ప్లేన్‌లో ప్రయాణించారు. 2000 సంవత్సరంలో క్లింటన్.. ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో పర్యటించారు. ముంబై నుంచి ఇస్లామాబాద్‌కు వెళ్తున్న సమయంలో.. బిల్ క్లింటన్ గుర్తు తెలియని విమానంలో వెళ్లారు.
భద్రతా కారణాల వల్ల ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని బిల్ క్లింటన్ దూరం పెట్టారు. వైట్‌హౌజ్ అధికారుల సమాచారం ప్రకారం.. ప్రత్యేక విమానంలో క్లింటన్ ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. అయితే ఆ సీక్రెట్ జర్నీ గురించి అమెరికా మీడియాకు వైట్‌హౌజ్ అధికారులు ముందే వెల్లడించారు. కానీ ఆ టైంలో ఒక్కరే ప్రధాన రిపోర్టర్ ఉన్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ప్రెస్ సిబ్బంది ముందుగా వెళ్లింది. ఆ విమానం ఇస్లామాబాద్ చేరుకున్న తర్వాత బిల్ క్లింటన్ ప్రయాణించిన సీక్రెట్ ప్లేన్ ఆ తర్వాత అక్కడకు చేరుకున్నది.