న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులు త్వరలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) కార్యాలయాన్ని సందర్శించే అవకాశం ఉంది. నీట్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టే ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఎంతవరకు అమలువుతున్నాయో పరిశీలించేందుకు ఈ తనిఖీ చేపట్టాలని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన చర్యలు వాస్తవంగా పనిచేస్తున్నాయా లేదా అనే దానిని పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది. ఆగస్టు 19న కేంద్రం సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరాల్లో నీట్ వ్యవస్థను సమూలంగా మార్చామని, దానిని ఉల్లంఘించడం కష్టమని పేర్కొన్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.