హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ క్రికెట్ సంఘానికి (టీసీఏ) బీసీసీఐ సభ్యత్వం ఇవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి బోర్డు పెద్దలను కోరారు. జంట నగరాలకు మాత్రమే పరిమితమైన హెచ్‌సీఏ వల్ల గత తొమ్మిది దశాబ్దాలుగా రాష్ట్రంలోని వేలాది మంది గ్రామీణ క్రికెటర్లు అవకాశాలు, కనీస మౌలిక సదుపాయాలు లేక నిరాదరణకు గురయ్యారని అన్నారు. ప్రత్యేక క్రికెట్ సంఘం ఏర్పాటుతోనే గ్రామీణ తెలంగాణకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం సందర్భంగా బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాను కలిసిన వెంకటేశ్వర్ రెడ్డి టీసీఏకు గుర్తింపు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. పుదుచ్చేరి, అండమాన్‌కు అసోసియేట్ సభ్యత్వం కల్పిస్తున్న బోర్డు టీసీఏకు కూడా గుర్తింపు ఇస్తే 2.5 కోట్ల జనాభా కలిగిన గ్రామీణ తెలంగాణకు న్యాయం చేసినట్టు అవుతుందన్నారు.