కోల్‌కతా, సెప్టెంబర్ 18 : వచ్చే నెల ఆరో తేదీన నందిగ్రామ్, రెజీనగర్ ఉప ఎన్నికలకు ముందు బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. మూడు దశాబ్దాలుగా ఉన్న ఆమె పార్టీ పేరు, గుర్తు గల్లంతయ్యింది. ఆమెకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ రెండుగా చీలిపోయిన క్రమంలో పార్టీ పేరు, గుర్తులను ఎన్నికల సంఘం స్తంభింప జేసింది. ఈ క్రమంలో రాబోయే ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం మమతా బెనర్జీ, పార్టీ చీలిక వర్గానికి తాత్కాలికంగా కొత్తపేర్లు, ఎన్నికల గుర్తులను శుక్రవారం కేటాయించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరును, పార్టీ గుర్తుగా ‘ఫుట్‌బాల్ ఆటగాడి’ని కేటాయించింది. అదే సమయంలో చీలిక వర్గానికి డెమోక్రాటిక్ తృణమూల్ కాంగ్రెస్ పేరును, పార్టీ గుర్తుగా కవరును కేటాయించింది. ఈ గుర్తులు కేవలం ఉప ఎన్నికల వరకేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మేలో ముగిసిన తర్వాత రితబ్రతా బెనర్జీ నేతృత్వంలో పార్టీని చీల్చి వేరే వర్గంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. తమదే అసలైన టీఎంసీ అని అతను ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడంతో ఇప్పుడు దానిపై వివాదం నడుస్తున్నది.
ఉప ఎన్నికలకు ముందు మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 6న జరిగే నందిగ్రామ్ ఉప ఎన్నికకు మమతా బెనర్జీ తరపున పోటీ చేయనున్న సంచితా ప్రధాన్ దే పోటీ నుంచి విరమించుకున్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిసిన కొద్ది గంటలకే ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా, సువేందు అధికారి భవానీపూర్, నందిగ్రామ్‌ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, ఆయన నందిగ్రామ్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతున్నది.
తన పార్టీ పేరు, గుర్తును స్తంభింపచేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి దినమని అభివర్ణించారు. ఎన్నికల సంఘం నిర్ణయంతో తాను పూర్తిగా విభేదిస్తున్నానని, ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, అన్యాయ ం, అప్రజాస్వామికమని, పూర్తిగా వివక్షాపూరితంగా ఉందని ఆరోపించా రు. ఒక రాజకీయ పార్టీ ఇగోను సంతృప్తి పర్చడానికే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. 29 ఏండ్లుగా ఉన్న పార్టీ గుర్తును, పేరును స్తంభింప చేయడం పట్ల ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీని ఆమె జుమ్లా పార్టీ అని విమర్శించారు. తాను ఇండియా కూటమిలో ఉన్నానని, తమ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తుందని ఆమె ప్రకటించారు. తాము బీజేపీని తరిమికొట్టాలనుకుంటున్నామని, ఆ పార్టీతో పోరాటానికి సిద్ధం గా ఉన్నామని ఆమె తెలిపారు. అయితే నందిగ్రామ్‌లో తమ పార్టీ అభ్యర్థిని పోటీ కి దించమని, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మమతా బెనర్జీ వాస్తవానికి ఈ సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని భావించారు. అనూహ్యంగా ఆమె ఈ సీటుకు సంచితా ప్రధాన్ దేను అభ్యర్థిగా ప్రకటించారు. నామినేషన్ల దాఖలుకు బుధవారమే ఆఖరు తేదీ కావడంతో మమతకు మరో అభ్యర్థిని నిలిపే అవకాశం లేకుండా పోయింది.
కోల్‌కతా: నందిగ్రామ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిలాన్ ప్రధాన్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని మాజీ సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అతడిని చాలా ఏండ్ల నాటి ఒక పాత హత్య కేసులో అరెస్ట్ చేశారు. 2007లో జరిగిన నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక నిరసనల్లో జరిగిన హత్య కేసులో అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తూ ప్రకటన చేయడం మమత ఇష్టమని, మద్దతు ఇవ్వాలని తామైతే ఆమెను కోరలేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.