న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ప్రైవేట్‌కు తలుపులు బార్లా తెరచి సంస్థను బలిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంపై ఉద్యోగ సంఘాలు మరోసారి స్పందించాయి. ఇస్రో సామర్థ్యానికి భంగం కలిగించేలా ప్రైవేట్ భాగస్వామ్యం ఉండరాదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్‌కు సిబ్బంది రాసిన తాజా లేఖలో పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం ఇస్రో సొంత సామర్థ్యాన్ని బలహీనపర్చరాదని, ఏండ్ల తరబడి ఎంతో వ్యయప్రయాసలతో కనుగొన్న సాంకేతికతను, సామర్థ్యాలను చవక ధరలకు ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయరాదని వివిధ ఉద్యోగ సంఘాలతో కూడిన జాయింట్ యాక్షన్ కౌన్సిల్ కోరింది. దేశ అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రైవేట్‌కు భాగస్వామ్యం కల్పించడంపై దేశంలో విస్తృతంగా చర్చలు జరుగుతున్న క్రమంలో వారీ ప్రకటన జారీ చేశారు.
జీఎస్ఎల్వీ-ఎఫ్ 17 మిషన్ విజయవంతమైన మరునాడు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ సంఘాలు ఈనెల 4న ఇస్రో చైర్మన్‌కు లేఖ రాశాయి. దానిపై ఇస్రో చైర్మన్ స్పందించి ఇస్రోను ప్రైవేటీకరించే ఎలాంటి ప్రయత్నం చేయటం లేదని తెలిపారు. సామర్థ్యాలను నిర్మించడం, బలోపేతం చేయడం యథావిధిగా కొనసాగుతుందని, అయితే అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్టు స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉద్యోగుల సందేహాలను తీర్చారు. అయితే ఉద్యోగ సంఘాలు మరో లేఖ రాశాయి.అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ను భాగస్వామ్యం చేయడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే వారి భాగస్వామ్యం జాతీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయాలే తప్ప ఇస్రో కీలక విధులను బలహీనపర్చరాదని జాయింట్ యాక్షన్ కౌన్సిల్ పేర్కొంది.