వనస్థలిపురం, సెప్టెంబర్ 18 : వారిద్దరూ స్నేహితులే, ఒకే దగ్గర నివాసం ఉండడంతో పాటు, ఒకే చోట వ్యాపారం కూడా చేస్తున్నారు. ప్లాటు కొనుగోలు విషయంలో ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన సమస్య గొడవగా మారి, హత్యాయత్నానికి దారి తీసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం. మీర్పేట్ సాయిదుర్గా కాలనీలో నివాసముండే దంగేటి భుజంగరావు(65) వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. నగరంలోని ఉస్మాన్గంజ్కు చెందిన శివేంద్రసింగ్తో గత కొంతకాలం స్నేహం ఏర్పడింది.
శివేంద్ర సింగ్ ఎన్జీవోస్ కాలనీలోనే మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. కాగా గౌలిగూడ నుంచి మకాం మార్చిన శివేంద్ర భుజంగరావు ఇంట్లోనే అద్దెకు ఉంటున్నాడు. వ్యాపారం, నివాసం ఒకే దగ్గర కావడంతో ఇద్దరి మధ్య స్నేహం బలంగా మారింది. ఈ నేపథ్యంలో భుజంగరావు తన ఇంటిపైన ఉన్న డబుల్ బెడ్రూం ఇల్లు, షట్టర్ అమ్మేందుకు బేరం పెట్టాడు. దానిని తనే కొనుగోలు చేస్తానని శివేంద్ర సింగ్ చెప్పడంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏడాది గడిచినా భుజంగరావు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో పాటు కోర్టుకు వెళ్లాడు.
దీంతో ఇరువురి మధ్య గతకొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున పార్లర్కు వస్తున్న భుజంగరావును ఎస్కేడినగర్ చౌరస్తా వద్ద అడ్డగించిన శివేంద్రసింగ్ కొబ్బరి బోండాల కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడి చేతిపై, మెడపై నరికి నిందితుడు పరారయ్యాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.