Forex Reserves | జులై 18తో ముగిసిన వారంలో భారత దేశ విదేశీ మారక నిల్వలు 1.183 బిలియన్ డాలర్లు తగ్గి 695.489 బిలియన్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ డేటా తెలిపింది. గతవారంలో మొత్తం నిల్వలు 3.064 బిలియన్లు తగ్గి 696.672 బిలియన్లకు చేరుకున్నాయని పేర్కొంది. సెప్టెంబర్ 2024 చివరి నాటికి ఈ నిల్వలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 704.885 బిలియన్లకు చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. విదేశీ మారక నిల్వలలో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు జూలై 18తో ముగిసిన వారంలో 1.201 బిలియన్లు తగ్గి 587.609 బిలియన్లకు చేరుకున్నాయి.
విదేశీ కరెన్సీ ఆస్తులు, విదేశీ మారక నిల్వలలో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి యూఎస్యేతర యూనిట్ల పెరుగుదల, తరుగుదల ప్రభావం ఉంటుంది. అయితే, ఈ వారంలో బంగారు నిల్వలు 150 మిలియన్లు పెరిగి 84.499 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 119 మిలియన్ డాలర్లు తగ్గి 18.683 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని సెంట్రల్ బ్యాంకు వివరించింది.