సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం డబ్బులు చెల్లించి ప్రయాణం చేసేవారి నడ్డి విరుస్తున్నది. ఉచిత బస్సు నష్టాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, సామాన్యులపై భారం మోపుతున్నది. ఇటీవల విద్యార్థుల బస్ పాస్‌లతో పాటు ఆర్డినరీ, గ్రీన్ మెట్రో తదితర బస్‌పాస్ ధరలను భారీగా పెంచిన ఆర్టీసీ.. తాజాగా టీ24 టికెట్ ధరను రూ.20 పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
దాదాపు రూ.1500-1800 పెట్టి పాస్‌లు తీసుకుంటే..బస్సుల్లో కనీసం కూర్చోవడానికి సీటు కూడా దొరకడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. బస్‌పాస్‌లను నమ్ముకొని విద్యాసంస్థలు, కార్యాలయాలకు చేరుకుంటున్న వారికి ఉపయోగపడే వివిధ రకాల బస్‌పాస్‌లపై 24 నుంచి 50 శాతం వరకు ధరలు పెంచేశారు. గ్రేటర్లో సుమారు 3.12లక్షల బస్‌పాస్‌లు ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, టూరిస్టులు రోజువారి, నెలవారి, త్రైమాసిక పాస్‌లను తీసుకుంటూ ఉంటారు. అయితే నిత్యం చార్జీలు పెంచుకుంటూ పోతున్న ఆర్టీసీ విధానాలపై విద్యార్థులు, ఉద్యోగులు, టీ24 టికెట్ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
