హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కష్టమేనని తేలిపోయింది. ప్రస్తుతం ఉన్న జలాలను కేవలం తాగునీటి వినియోగాలకే కేటాయించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఒకవేళ రాబోయే రోజుల్లో వరదలు వస్తే, సాగునీటిని అందించాలని యోచిస్తున్నారు. జలసౌధలో సమీకృత జల ప్రణాళిక, నిర్వహణ రాష్ట్ర స్థాయి కమిటీ (స్కివమ్) సమావేశం ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఈఎన్సీ రమేశ్‌బాబు నేతృత్వంలో కొనసాగింది.
ప్రాజెక్టుల వారీగా ప్రస్తుతం ఉన్న నీటినిల్వలు, తాగు, సాగునీటి అవసరాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లకు సెక్రటరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ప్రాజెక్టుల్లో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేదని, ఎల్ నినో నేపథ్యంలో తొలుత తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ నేపథ్యంలో ప్రస్తుతం సాగునీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోతున్నదని వివరించారు.
ఇప్పటికే నాట్ల సీజన్ కూడా ముగిసిందని, ఇప్పుడిచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండబోదని, తదుపరి ప్రాజెక్టులకు వరదలు రాకుంటే సాగునీటి డిమాండ్లను తీర్చలేమని సీఈలు సైతం సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చారు. మొత్తంగా ప్రస్తుతం ఉన్న నీళ్లను కేవలం తాగునీటికే ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ప్రాజెక్టుల వారీగా ఏడాది మొత్తానికి కావాల్సిన తాగునీటి అవసరాల లెకలను సిద్ధం చేయాలని, తదుపరి వచ్చే వరదలను బట్టి సాగు అవసరాలపై నిర్ణయం తీసుకొందామని, 15 రోజుల్లో మరోసారి మీటింగ్ నిర్వహిస్తామని సెక్రటరీ వెల్లడించారు. ఆ లోగా డాటా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.