సిద్దిపేట, ఆగస్టు 6: ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత కరెంట్‌కు మంగళం పాడేందుకు ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. కరెంట్ సరిగ్గా రావడం లేదని రైతులు చెప్పడంతో గురువారం ఆయన గురువారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి లాగ్‌బుక్‌ను పరిశీలించగా, బుధవారం 10:30గంటలు మాత్రమే సరఫరా చేసినట్టు రికార్డు అయ్యింది.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 20నుంచి 24గంటల కరెంట్ వచ్చేదని, కాంగ్రెస్ వచ్చాక కేవలం 10నుంచి 12 గంటలే వస్తున్నదని రాఘవాపూర్ రైతులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. అంతేగాక సరఫరా చేస్తున్న విద్యుత్‌లోనూ అంతరాయం కలుగుతున్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్లో నీళ్లు నింపకపోవడంతో రాఘవాపూర్ పెద్ద చెరువులో నీళ్లు లేవని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
నాణ్యమైన 24గంటల కరెంటు ఇవ్వాలని సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలు, నిరసనలు తెలుపుతున్న రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ సరఫరా చేస్తామన్న ఉచిత కరెంటు ఉత్తదేనా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అయితే కరెంట్ గురించి హరీశ్‌రావు మాట్లాడుతుండగానే ఐదు నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం గమనార్హం. రాష్ట్రంలో చాలామంది రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీలు కట్టినా, ప్రభుత్వం ఇప్పటివరకు ట్రాన్స్ఫార్మర్లు, కనెక్షన్లు ఇవ్వలేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. విద్యుత్ కనెక్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.