కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల శాఖలను ఒకే గొడుగు కిందికి తెచ్చింది. అందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం, జగిత్యాల పరిధిలో సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అంతకు ముందు ఎల్ఎండీ కాలనీలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు సర్కిల్ కార్యాలయాన్ని రామగుండం సర్కిల్‌గా మార్చింది. ఎల్ఎండీ కేంద్రంగా పని చేసిన ఈ కార్యాలయాన్ని అప్పట్లోనే రామగుండంకు మార్చారు. కానీ, కొందరు ఉద్యోగులు మాత్రం ఎల్ఎండీ కాలనీలోని గెస్ట్‌హౌస్ పక్కన ఉన్న పాత కార్యాలయంలోనే ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్నారు. కరీంనగర్లో స్థిర నివాసాలు ఉన్న ఒకరిద్దరు అధికారులు, ఉద్యోగులు ఇక్కడి నుంచే విధులు నిర్వహించడంతో పరిపాలన పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సర్కిల్ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. ఆయకట్టు మొత్తం పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉంటే ఇక్కడ పనిచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కరీంనగర్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు ఆవిష్కరణ తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 డిసెంబర్లో అన్ని నీటి పారుదల శాఖలను ఒకే గొడుగు కిందికి తెచ్చింది. భౌగోళిక ప్రాంతాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 సీఈ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. భారీ నీటి పారుదల, చిన్న నీటి పారుదల శాఖలుగా విడివిడిగా ఉన్న వాటిని ఒకే గొడుగు కిందికి తెచ్చి, నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖగా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం, జగిత్యాలలో మూడు సీఈ కార్యాలయాలను, 23 డివిజన్లు, 89 సబ్ డివిజన్లను ఏర్పాటు చేసింది. అప్పటి వరకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీ నుంచి పనిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాన్ని రామగుండం సీఈ కార్యాలయంగా మార్చి అక్కడికి తరలించింది. పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లోని అన్ని నీటి పారుదల వ్యవస్థలను ఈ కార్యాలయం కిందికి తెచ్చింది. 3.72 లక్షల ఆయకట్టును ఈ కార్యాలయం పరిధికి స్థిరీకరించింది. 2020 డిసెంబర్ 31న అప్పటి ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేయగా, 2021 జనవరిలో అన్ని కార్యాలయాలు వాటికి కేటాయించిన కేంద్రాలకు వెళ్లాయి. కానీ, ఎల్ఎండీ కాలనీలో గతంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇప్పటికీ కొందరు ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
పూర్వ కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాన్ని గతంలో ఎల్ఎండీ కాలనీలోని గెస్ట్‌హౌస్ పక్కన ఏర్పాటు చేశారు. దీనికి ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణ పూర్తిగా ఇక్కడి నుంచి నిర్వహించారు. అయితే పునర్వవస్థీకరణ తర్వాత ఈ కార్యాలయాన్ని రామగుండం సీఈ కార్యాలయంగా మార్చారు. అందుకు సంబంధించి ఎన్టీపీసీలోని పోలీస్ స్టేషన్ దగ్గర ప్రత్యేకించి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు 2021 జనవరిలోనే కార్యాలయాన్ని అక్కడికి తరలించారు. కానీ, కొందరు ఉద్యోగులు మాత్రం పాత కార్యాలయం నుంచే ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్నారు. 60 మందికిపైగా ఉద్యోగులు ఉన్న ఈ కార్యాలయంలో ఎల్ఎండీ కాలనీలోని పాత కార్యాలయంలో ఇద్దరు డీఈలు, ఐదుగురు ఏఈలు, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ ఆఫీసర్, మరో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ఒక జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఇద్దరు అటెండర్లు విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే అధికారులు మాత్రం టెక్నికల్ సిబ్బంది మాత్రమే ఇక్కడ పని చేస్తున్నారని, పరిపాలన సౌలభ్యం కోసమే ఎల్ఎండీ కాలనీలోని పాత కార్యాలయంలో పనిచేస్తున్నారని చెబుతున్నారు. కానీ, ఇది అధికారిక కార్యాలయమే అయితే బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఈ శాఖ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.
రామగుండం వరకు వెళ్లడం ప్రయాసగా భావించి ఇక్కడి నుంచే పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వీరికి అధికారులు కూడా వత్తాసు పలుకుతుండడంతో ఐదారేళ్లుగా ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. దీని వల్ల పరిపాలనపరమైన ఇబ్బందులు వస్తున్నాయని, కొందరు ఇక్కడ, మరి కొందరు అక్కడ పనిచేస్తున్నారని, కింది స్థాయి ఉద్యోగులతో అక్కడి ఫైల్స్ ఇక్కడికి, ఇక్కడి ఫైల్స్ అక్కడికి తెప్పించుకుంటున్నారని, ఎల్ఎండీలో ఉండే ఉద్యోగులను పర్యవేక్షించే వారు కూడా లేరని, ఈ కారణంగా పనులు కూడా కుంటుపడుతున్నాయని చెబుతున్నారు. రామగుండం ఇరిగేషన్ సీఈ పరిధిలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలు ఉన్నాయని, దాదాపు 3.72 లక్షల ఎకరాల ఆయకట్టు మొత్తం పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉందని, అలాంటప్పుడు ఎల్ఎండీ కాలనీలో కొందరు టెక్నికల్ సిబ్బంది ఏ బేసిక్‌పై ఇక్కడ పనిచేస్తున్నారో అధికారులే సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. రామగుండంలో విధులు నిర్వహించాల్సిన అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచి పనిచేయడం వల్ల ఎలాంటి పరిపాలన సౌలభ్యం ఉన్నదో వారికే తెలియాలని అంటున్నారు. అధికారులు చెప్పినట్టుగా ఇది అధికారిక కార్యాలయమే అయితే ఒక బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే ఈ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులను రామగుండం నుంచి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మా కార్యాలయం రామగుండంలోనే ఉంది. ఎల్ఎండీ కాలనీలో కొందరు సాంకేతిక ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నది వాస్తవమే. పరిపాలన పరమైన సౌలభ్యం కోసం ఇక్కడి నుంచి విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్ఎండీలోనే కార్యాలయం ఉండేది. ఇపుడు కొందరు ఇక్కడి నుంచి విధులు నిర్వహిస్తున్నారు.
$- శ్రీనివాస్ గుప్త, ఇరిగేషన్ సీఈ రామగుండం