రామగిరి, మార్చి 2: బీఈడీ విద్యలో ఫేస్ రికగ్నేషన్ మిషిన్‌తో విద్యార్థులు, అధ్యాపకులకు కచ్చితంగా హాజరు అమలు చేయాలని ఎంజీయూ వీసీ ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సూచించారు. బీఈడీ విద్య అమలు, తదితర అంశాలపై ఎంజీయూలో సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన సమీక్షించారు. మారుతున్న కాలానికి అనుగునంగా బీఈడీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపర్చాలన్నారు. కచ్చితంగా ప్రతి సెమిస్టర్లో విద్యార్థులకు 75శాతం హాజరు ఉండాలన్నారు. ఉపాధ్యాయ విద్యలో ఎన్నో సంస్కరణలు వస్తున్నాయని, వాటిపై కళాశాలల అధ్యాపకులు సైతం నైపుణ్యాలు పెంచుకోవాలని, డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్‌తో కలిపి 10మంది అధ్యాపకులు విధిగా ఉండాలని, నిత్యం బోధన సాగాలన్నారు. ఆధార్ లింక్‌తో అధ్యాపకులకు ఫేస్ రికగ్నేషన్ హాజరు నమోదు చేయాలని, ఉన్నత విద్యామండలితోపాటు ప్రభుత్వ నిర్ణయమన్నారు.
అన్ని కళాశాలలు ఫేస్ రికగ్నేషన్ మిషిన్లు వినియోగించాలని, హాజరు లేని విద్యార్థులను పరీక్షలతోపాటు స్కాలర్షిప్ నిలిపివేయాలన్నారు. బీఈడీ విద్యతో ఛాత్రోపాధ్యాయులకు టీచింగ్ ప్రాక్టిస్ కీలకమైందని, వాటికి సంబంధించిన రికార్డుల నిర్వహణ, ప్రాక్టికల్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. తప్పులు జరిగితే కళాశాలలపై నిబంధనల మేరకు చర్యలుంటాయని తనదైన శైలిలో చురకులు వేశారు. బీఈడీ మోడరేషన్‌కు తీసుకవచ్చిన రికార్డులను తిరిగి కళాశాలలకు ఇవ్వడం జరగదని వెల్లడించారు. కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, ప్రస్తుతం జరిగే సెమిస్టర్ 2, 4 టీచింగ్ ఛాత్రోపాధ్యాయుల టీచింగ్ ప్రాక్టిస్‌కు ప్రతి విద్యార్థి హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ డా.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ. కొప్పుల అంజిరెడ్డి, వర్సిటీ ఇన్ఫ్స్రక్చర్ డౌలప్మెంట్ డైరెక్టర్ ప్రొ. ఆకుల రవి, బీఈడీ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.