బూర్గంపహాడ్, జూలై 29 : ఐటీసీ పీఎస్పీడీ చిన్నారుల సంక్షేమం కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని మహిళా శిశు సంక్షేమ అధికారిణి(డీడబ్ల్యూఓ) స్వర్ణలత లెనిన్ అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గాంధీనగర్ ఒడియాక్యాంప్లో ఐటీసీ పీఎస్పీడీకి అనుబంధంగా ఉన్న మిషన్ సునిరేకల్, వాష్ ఇనిస్టిట్యూట్ సంయుక్త సహకారంతో రూ.11.50 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సర్పంచ్ గుగులోత్ కిశోర్నాయక్, ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు, వార్డు సభ్యురాలు ఉమా లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ప్రాథమిక మౌలిక వసతులు కల్పించడంలో ఐటీసీ సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని అంగన్వాడీలు సద్వినియోగం చేసుకుని గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ తార, ఎంఎస్కే ప్రోగ్రామ్ మేనేజర్ జయప్రకాష్, ఐటీసీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గీత, వాష్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలకృష్ణ, ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.