తిరుమలగిరి, మార్చి 2: తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నూతన పాలక వర్గం ఏర్పాటు సందర్భంగా మున్సిపాలిటీ పరిసరాల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం అర్ధరాత్రి తొలిగించారు. మంత్రి ఉత్తం ఆదేశించారో లేక ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారో తెలియదు కానీ అధికారుల దౌర్జన్యకాండ కొనసాగింది. రాత్రి 7 గంటల నుంచే ఫ్లెక్సీలను తొలిగిస్తారనే సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీల వద్ద ఉండగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మున్సిపల్ కమిషనర్, ఇన్స్పెక్టర్, ఎస్ఐలు మున్సిపల్ సిబ్బందితో వెళ్లి తిరుమలగిరి చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఆ సమయంలో ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు వెళ్లి అర్ధరాత్రి ఫ్లెక్సీలను తొలగించడం ఏంటి… అంత అవసరం ఏముంది… సిబ్బందిని ఈ సమయంలో తీసుకురావడం సమంజసమా అని ప్రశ్నించగా అక్కడున్న ఎస్ఐ లక్షల్లో వేతనాలు తీసుకోవడం లేదా ఎందుకు చేయరు.. అసలు అడగేందుకు మీరెవరు అంటూ దబాయించారు.
వాస్తవానికి తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ కైవసం చేసుకోగా మున్సిపాలిటీ ప్రథమ పౌరుడుగా ఉన్న చైర్మన్ అనుమతి లేకుండానే ఫ్లెక్సీలను తొలగించడంపై అధికారుల తీరును ప్రజలు అసహించుకుంటున్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం ఎమ్మెల్సీ కోటిరెడ్డి మున్సిపాలిటీలో ఓటేసేందుకు ముందస్తుగా ఎక్స్అఫిషియో సభ్యులుగా నమోదు చేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా పది నిముషాల్లో పూర్తి కావాల్సిన తంతును దాదాపు ఐదు గంటల పాటు నిరీక్షణ చేయించి తీరా మీకు అవకాశం లేదంటూ చెప్పి పంపిన కమిషనర్ తీరు విమర్శలు పాలైన విషయం విదితమే. అదే కమిషనర్ నేడు చైర్మన్ ఫొటో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడంపై అధికార పార్టీకి ఏ స్థాయిలో వత్తాసు పలుకుతున్నాడో అర్థం అవుతుంది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేననే విషయం అధికారులు గుర్తుంచుకోవాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు సూచిస్తున్నాయి.