ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూన్ 24: ఆసిఫాబాద్ మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. మండలంలోని రాజుర (Rajura)గ్రామ సమీపంలోని ఒర్రె ఉప్పొంగింది. దాంతో, లో లెవల్ వంతెన పై నుండి ప్రమాదకరంగా వరదనీరు ప్రవహించింది. ఫలితంగా సుమారు మూడు గంటల పాటు ఆ గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. వంతెనలో చెత్త పేరుకుపోవడం వల్ల వరదనీరు వంతెన కింది నుండి ప్రవహించడం సాధ్యం పడడం లేదు.
వానపడిన ప్రతిసారి ఇదే సమస్య ఎదురవుతుందని స్థానికులు వాపోతున్నారు. జూన్ నెలలో ఇలా రెండు మూడు సార్లు లో లెవల్ వంతెన మీద నుండి వరద నీరు ప్రవహించిందని.. ఆ సమయంలో రాకపోకలు స్తంభించాయని వివరించిన గ్రామస్తులు అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాయంత్రం భారీ వర్షం కురవడంతో వదర నీరు చేరగా ఆసిఫాబాద్‌లోని బడులకు, కళాశాలకు వెళ్లిన విద్యార్థులు ప్రవాహం తగ్గేంత వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని గ్రామస్థులు చెబతున్నారు. రోడ్డు పై నుండి నీరు వెళ్ళడం కారణంగా ఇరువైపుల రోడ్డు కోతకు గురవుతుందని.. అటోలు, వాహనాల్లో ఈ దారిగుండా వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని తెలిపారు స్థానికులు. అధికారులు తక్షణమే స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.