Harish Rao | ప్రభుత్వ కార్యక్రమని మరిచి.. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అడ్డగోలు వ్యాఖ్యలు చేసి సీఎం రేవంత్‌రెడ్డి తన చిల్లర బుద్ధిని ప్రదర్శించాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు శనిలా, శాపంలా మారిన రేవంత్ రెడ్డి ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అనే రీతిలో పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని తక్కువ చేసి చూపి రాష్ట్ర ప్రజలను అవమానించారని విమర్శించారు. ఎన్నికల్లో అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే ఎటూ పాలుపోక నిరాశ నిస్పృహలతో పాలనలో కూడా ప్రతి రోజూ అబద్ధాలు, బూతులతో నెట్టుకొస్తాని రేవంత్‌రెడ్డి అనుకుంటే కుదరదన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై భరోసా లేక విధి లేని పరిస్థితుల్లో రైతు భరోసా వేసి తానే రైతులకు ఛాంపియన్ అనే బిల్డప్ ఇస్తే ఎవరు నమ్ముతారు రేవంత్ రెడ్డి? అంటూ మండిపడ్డారు.
దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని ఆలోచించి.. రైతుబంధు మొదలు పెట్టి రూ.80వేల కోట్ల అన్నదాతల అకౌంట్లలో వేసి వ్యవసాయాన్ని పండగలా చేసిన కేసీఆర్‌ను ఉరి తీయాలని ఉన్మాదిలా మాట్లాడుతావా ? తెలంగాణ నిన్ను క్షమించదు రేవంత్ రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లే ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షకోట్ల అవినీతి జరిగిందంటే ప్రపంచం నవ్విపోతున్నదని.. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎడారిగా మారితే ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశం నెంబర్ వన్ ఎలా అవుతుంది రేవంత్ రెడ్డి ? అంటూ నిలదీశారు. అధికారంలోకి వచ్చినాక కనీసం ఒక చెక్ డ్యామ్ కట్టావా? ఓ కాలువ తవ్వావా? ధాన్యం ఉత్పత్తి పెరగటానికి రేవంత్ రెడ్డి ? పదేళ్ల కేసీఆర్ పాలనలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 44 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తేనే కదా ధాన్యం ఉత్పత్తి.. రూ.3కోట్ల టన్నులను తాకింది రేవంత్ రెడ్డి ? కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు రూ.4వేలకోట్ల ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే పని చేశామన్నారు.
ఇరిగేషన్‌శాఖలో ఈ వివరాలు ఉన్నాయని.. అధికారులను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఉండి సీఎం స్థానంలో ఉండి, సభా నాయకుడిగా వ్యవహరిస్తున్న నీకు అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు ప్రతిపక్షం డిమాండ్ చేయాల్సిన పని లేదని తెలియదా? అని మండిపడ్డారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఏ వేదిక మీదనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని.. నీ ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపించి తెలంగాణకు చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. కృష్ణా నదిపై సమైక్య పాలకులు 299 టీఎంసీల మేరకే ప్రాజెక్టులు ప్రతిపాదించినందుకే కదా? ఆ మొత్తంలో నీటిని వాడుకునేందుకు తాత్కాలిక ఒప్పందం కుదిరిందని ఎన్నిసార్లు వాస్తవాలు చెబుతున్నా.. పని గట్టుకుని బురద జల్లే నీ మూర్ఖత్వాన్ని అర్థం చేసుకోనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కాదన్నారు. మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయని దద్దమ్మవి నువ్వు.. ఇప్పుడు అన్నారం, సుందిళ్ల కూడా కూలిందని అంటున్నావని.. అది నోరా.. మోరా ? అంటూ తీవ్రంగా స్పందించారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలపై, ఉద్యోగ నియామకాలపై అదే పనిగా అబద్ధాలు చెబితే అవి నిజాలై పోతాయా? అని నిలదీశారు. దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఇసుమంతైనా నిజాయితీ ఉంటే రూ.30 లక్షలు మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా ఇచ్చి మాట్లాడు మాట్లాడాలని సవాల్ విసిరారు. సన్న వడ్లకు బోనస్‌ను రైతుల అకౌంట్లలో వేశానని బోగస్ మాటలు చెప్పొద్దని.. నిజాయతీ ఉంటే రూ.1200 కోట్ల బోనస్ బకాయిలు అకౌంట్లలో వేయాలని.. పిల్లి శాపాలకు ఉట్లు తెగయనే విషయాన్ని గ్రహించాలని సీఎం రేవంత్‌కు సూచించారు. గెలిచిన వాడు రాజు.. ఓడిపోయిన వాడు రావణాసురుడు అంటున్నాని.. రాహుల్ గాంధీ రావణాసురుడేనా ? ఉన్మాదంలో ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదని.. హామీల గురించి ప్రశ్నిస్తున్నందుకు బూతులతో చెలరేగుతున్నా సంయమనాన్ని కోల్పోమన్నారు. ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా వెంటపడుతూనే ఉంటాయమని.. అబద్ధాల పుట్టను బద్దలు కొడుతామని స్పష్టం చేశారు.