దస్తూరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ‘రైతు బాంధవుడు’ అని పీఏసీఎస్ ఛైర్మన్ రామడుగు శైలజ రమేష్ రావ్ అన్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా వేసిన డబ్బులు జమచేసిన శుభ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దస్తూరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు ట్రాక్టర్లతో, బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారా, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజ రమేష్ మాట్లాడుతూ…9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.